రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి  ద్రౌపది ముర్ము నామినేషన్ వేశారు. రాజ్యసభ సెక్రటేరియట్ లో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ ఆమె నామినేషన్ ను ప్రతిపాదించగా..50మంది సభ్యులు బలపరిచారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఇక బీజేడికి చెందిన ఇద్దరు మంత్రులు ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతుగా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. మరోవైపు ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతు ప్రకటించారు. నామినేషన్ పత్రాలపై వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి సంతకాలు చేశారు. తొలిసారిగా ఓ గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం రావడం మంచి పరిణామన్నారు జగన్. 

అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్  విగ్రహాలకు ద్రౌపది ముర్ము నివాళులర్పించారు . ఇవాల్టి నామినేషన్ కార్యక్రమం తర్వాత ఆమె రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. జూలై 1 నుంచి రాష్ట్రాల టూర్ కు వెళ్లనున్నారు. రోజుకు రెండు రాష్ట్రాల్లో పర్యటించేలా బీజేపీ ముఖ్య నేతలు షెడ్యూల్ రెడీ చేస్తున్నారు . జూలై 18 న రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్  జరగనుంది. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ వేయనున్నారు.