V6 News

రైల్వేలో ఉద్యోగాల కోత.. 2026లో 30 వేల పోస్టుల రద్దుకు ఆదేశాలు

రైల్వేలో ఉద్యోగాల కోత.. 2026లో 30 వేల పోస్టుల రద్దుకు ఆదేశాలు

భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. దాదాపు 30 వేల ఉద్యోగాలను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రద్దు చేసిన ఉద్యోగాలను అవసరాన్ని బట్టి ఇతర రైల్వే జోన్లకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా.. రైల్వే ఉద్యోగాల్లో 2 శాతం కోత విధించినట్లయింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేలో మొత్తం 29 వేల 608 ఉద్యోగాలను రద్దు చేయడం జరుగుతుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు పేరుతో ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ లేఖ చూస్తే.. ఏప్రిల్ 24, 2026 నాటి రైల్వే బోర్డు లేఖ ప్రకారం.. రైల్వేల హేతుబద్ధీకరణ లక్ష్యం కింద 3 వేల 303 ఉద్యోగాల రద్దుతో నార్త్ రైల్వే జోన్ అత్యధికంగా ప్రభావితం కానుంది. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని 2 వేల 492 ఉద్యోగాలు, వెస్ట్ రైల్వే జోన్లో 2 వేల 339 ఉద్యోగాలు రద్దు కాబోతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్లో మొత్తం 14 లక్షల 80 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. అందులో 29 వేల 608 ఉద్యోగాలు.. అంటే దాదాపు 2 శాతం ఉద్యోగాలు రద్దవుతాయని ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఏ రైల్వే జోన్లో ఎన్ని ఉద్యోగాలు ప్రభావితం కానున్నాయంటే..
* నార్త్ రైల్వే: 3,303 పోస్టులు 
* ఈస్ట్ రైల్వే: 2,544 పోస్టులు 
* సెంట్రల్ రైల్వే: 2,492 పోస్టులు
* వెస్ట్ రైల్వే: 2,339 పోస్టులు
* సౌత్ ఈస్ట్ రైల్వే (SER), దక్షిణ మధ్య రైల్వే (SCR), దక్షిణ రైల్వే (SR), తూర్పు మధ్య రైల్వే (ECR)లలో 1,800 నుంచి 2,000 ఉద్యోగాలు
* నైరుతి రైల్వే (SWR)లో 893 పోస్టులు