అప్పులు కావాలి ఆదుకోండి.. కేంద్రానికి రాష్ట్ర సర్కారు రిక్వెస్ట్​

అప్పులు కావాలి ఆదుకోండి..  కేంద్రానికి రాష్ట్ర సర్కారు రిక్వెస్ట్​
  • అప్పులు కావాలి.. ఆదుకోండి..  కేంద్రానికి రాష్ట్ర సర్కారు రిక్వెస్ట్​
  • గ్యారంటీ, ఎన్​సీడీసీ  లోన్ల కోసం తంటాలు
  • ఎన్నికల టైంలో స్కీములకు నిధుల కొరతతో టెన్షన్​
  • మొదలై నెలవుతున్నా ఐదెకరాలకే ఆగిపోయిన రైతుబంధు
  • జులైలోనే ప్రారంభిస్తామన్న దళిత బంధు, గృహలక్ష్మి స్కీములు ఇప్పటికీ మొదలు కాలే
  • బీసీలకు రూ. లక్ష సాయం స్కీమ్​ అంతంతగానే ప్రారంభం
  • మైనార్టీలకు లక్ష సాయానికి, పెంచిన డైట్​ చార్జీలకూ తిప్పలు

హైదరాబాద్, వెలుగు:  అప్పుల కోసం రాష్ట్ర సర్కార్​ తంటాలు పడుతున్నది. గ్యారంటీ అప్పులకు నిబంధనలు అడ్డొస్తుండటం, ఆర్బీఐ నుంచి నిర్దేశించిన మేరకే లోన్లు వస్తుండటంతో స్కీముల అమలుపై టెన్షన్​ పడుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖజానా ఖాళీ కావడం ఒకవైపు.. పథకాలు అమలు కాకుంటే కార్యకర్తలే ఓడిస్తారని లీడర్లు చెప్తుండటం మరో వైపు ఇబ్బందికరంగా  మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సఖ్యత సంకేతాలు పంపుతూ అప్పులకు అనుమతులను కోరుతున్నది.  కేంద్రం ​నిర్వహించే మీటింగులకు మొన్నటి దాకా రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంటూ వచ్చింది. అయితే.. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్​ భేటీకి మంత్రి హరీశ్​ హాజరయ్యారు. సీఎస్​, ఆర్థిక శాఖ స్పెషల్​ సీఎస్​, సెక్రటరీలు చేస్తున్న ఢిల్లీ పర్యటనల్లో నిధులు, అప్పులపైనే ఫోకస్​ పెట్టినట్లు తెలిసింది. 

తెలంగాణ రాష్ట్ర నీటి అభివృద్ధి సంస్థ లిమిటెడ్​ (టీఎస్​డబ్ల్యూఆర్​ఐడీసీఎల్​), పీఎఫ్​సీ, రూరల్​ ఎలక్ట్రిఫికేషన్​ కార్పొరేషన్​ (ఆర్​ఈసీ)తో పాటు ఇతర గ్యారంటీ అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గొర్రెల స్కీంకు సంబంధించి నేషనల్​ కోఆపరేటివ్​ డెవలప్​మెంట్ కార్పొరేషన్​ (ఎన్​సీడీసీ) అప్పు రూ.5 వేల కోట్లకు సంబంధించి నిధుల రిలీజ్​ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. మొత్తం ఏకకాలంలో కాకపోయినా దశలవారీగా అయినా కనీసం రూ. 8 వేల కోట్లకు అయినా పర్మిషన్​ వచ్చేలా సహకరించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.  

రెగ్యులర్​ అప్పులకు తోడుగా.. గ్యారంటీ అప్పులు

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా నుంచి యావరేజ్​గా ప్రతి నెలా రూ.4 వేల కోట్ల నుంచి 5 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. ఇదంతా బడ్జెట్​లో పెట్టుకున్న దానికి తగ్గట్టుగా ఎఫ్​ఆర్​బీఎం పరిధిలో చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రూ. 40,615 కోట్లు బాండ్ల అమ్మకంతో సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్నది. దీంట్లో ఇప్పటిదాకా రెగ్యులర్​ అప్పుల కింద దాదాపు రూ.18  వేల కోట్లు తీసుకున్నది. ఈ జులై నెలలోనే ఇప్పటిదాకా రూ.5 వేల కోట్లు తీసుకున్నట్లు ఆర్బీఐ  లెక్కలు  వెల్లడిస్తున్నాయి. జులై 18న రూ.2 వేల కోట్లు, జులై 11న వెయ్యి కోట్లు, జులై 4న  2 వేల కోట్లు తీసుకున్నది. అవసరమైతే ఈ నెలాఖారులో ఇంకో రూ.2 వేల కోట్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నది. ఇవి కాకుండా వేస్​ అండ్​మీన్స్​ కింద అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు రూ. 1,000 కోట్ల నుంచి 1,500 కోట్లు తీసుకుంటున్నది. ప్రస్తుతం ఇవి సరిపోకపోవడంతో గ్యారంటీ అప్పులు తీసుకునేందుకు ప్లాన్​ చేస్తున్నది. దీనికి కేంద్రం, ఆర్బీఐ గత ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని నిబంధనలను అమలు చేస్తున్నాయి. గ్యారంటీ అప్పు ఎట్లా తీరుస్తారనేది నివేదిస్తేనే వాటిని తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్​ ఇస్తున్నాయి. దీంతో రాష్ట్ర సర్కార్​ మొన్నటి దాకా గ్యారంటీ అప్పులను లైట్​ తీసుకున్నది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం.. నిధుల కొరత మొదలవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. కనీసం గ్యారంటీ అప్పులనైనా పథకాలకు మళ్లించాలని చూస్తున్నది. అందులో భాగంగానే ఆర్ఈసీ, టీఎస్​డబ్ల్యూఆర్​ఐడీసీఎల్, పీఎఫ్ సీ, ఎన్​సీడీసీలతో పాటు ఇతర రాష్ట్ర కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీ అప్పులకు తాపత్రాయ పడుతున్నది.   

స్కీముల గండం 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కీములు కూడా ఖజానాలో పైసల్లేక ఆగిపోయాయి. జూన్​ మొదటి వారంలో అమలు చేయాల్సిన రైతుబంధు జులై నెల చివరి దశకు చేరుకున్నా పూర్తి కాలేదు. రైతుబంధు సొమ్ము జమ చేయడం మొదలై దాదాపు నెల కావొస్తున్నది. ఇప్పటి దాకా 5 ఎకరాల లోపు ఉన్న పట్టాదారులకు ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందింది. మిగిలిన వారికి ఎదరుచూపులు తప్పడం లేదు. ఇంకో రూ.2,500 కోట్లు అయితేనే రైతుబంధు పూర్తవుతుంది. ఇక జులైలోనే మొదలుపెడుతామని చెప్పిన దళితబంధు, గృహలక్ష్మి స్కీముల అప్లికేషన్​ ప్రాసెస్​ కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. బీసీ చేతివృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం స్కీమ్​ గందరగోళంగా మారింది. మొదటిదశలో నియోజకవర్గానికి కేవలం 50 మందికే ఇచ్చారు. ఈ లెక్కన 7 వేల మందికి లోపే సాయం అందింది. కానీ, ఈ స్కీం కోసం దాదాపు 5.20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. తాజాగా పెంచిన దివ్యాంగుల పెన్షన్​కు, కొత్తగా మైనార్టీలకూ మొదలుపెట్టనున్న రూ. లక్ష ఆర్థిక సాయం అమలు ఎట్లా అనే దానిపై ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పెంచిన డైట్​ చార్జీలకూ  ఇబ్బందులు తప్పేలా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్​ టైం కనుక  ఇప్పటికే రూ. వేల కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు, కేసీఆర్ కిట్, మన ఊరు – మన బడి వంటి వాటికి నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఆ నిధులు ఎట్లా సర్దుబాటు చేయాలనేది తలకు మించిన భారంగా మారింది.

ఖజానా ఖల్లాస్ 

రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పరిస్థితి దారుణమైన స్టేజ్​ లో ఉందని ఆఫీసర్లు, ఫైనాన్స్​ ఎక్స్​పర్ట్స్​ పేర్కొంటున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 4.60 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు స్టేట్​ ఓన్​ ఇన్​కం పడిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపు లకే ప్రతినెలా వారం, పది రోజులు అన్నింటికి నిధుల విడుదల ఆపి మరీ చేస్తున్నారు. ఇట్లా నడిస్తే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని భావిం చే సర్కార్​ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం, గ్యారంటీ అప్పులు తెచ్చుకోవడం, ఔటర్​ రింగ్​ రోడ్డు టీవోటీ సొమ్మును త్వరగా ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకోవడం, జీవో 58,  59 అప్లికేషన్లు పూర్తి చేయడం వంటివి వేగవంతం చేసింది.