సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది

సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది

హనుమకొండ, వెలుగు:  ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అడిషనల్ డీసీపీ వైభవ్​ గైక్వాడ్ అన్నారు. వరంగల్ కమిషనరేట్​లో పిల్లలు, మహిళలపై జరిగే నేరాలపై చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా గైక్వాడ్ హాజరై మాట్లాడారు. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్ లలో పేటీఎం, గూగుల్ పే, ఫోన్   ‌‌ ‌‌పే, కేవైసీలను అప్ ‌‌డేట్ చేయమని వచ్చే మెసేజ్ లకు స్పందించ కూడదన్నారు.  సైబర్ నేరాలకు గురైనప్పుడు  1930 నెంబర్​ కు డయల్ చేయాలన్నారు.  ‌‌ ‌‌  ‌‌ ‌‌   ‌‌ ‌‌  ‌‌ ‌‌ 

వెంటనే ఫిర్యాదు చేయాలి..

సైబర్ క్రైమ్ కు గురైన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్ జనార్దన్​రెడ్డి అన్నారు. చైల్డ్ లైన్ 1098 కోఆర్డినేటర్ రాగీ కృష్ణ మూర్తి మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకుని సైబర్​నేరాలు పెరుగుతున్నాయన్నారు. ఇంటర్నెట్​ను పరిమితికి మించి వాడకూడదని సూచించారు. అనంతరం ఆన్​ లైన్​ మోసాలు,  ఆర్థిక నేరాలు , లోన్ యాప్స్ , ఓటీపీ ,  చైల్డ్ ఫోర్నోగ్రఫీ తదితర సైబర్ నేరాలపై ఐటీ కోర్, సైబర్ క్రైం ఆఫీసర్లు ప్రశాంత్, రాజు వివరించారు.  చైల్డ్ లైన్ నోడల్ ఆఫీసర్ ఇక్బాల్ పాషా, యాంటీ హ్యూమన్  ట్రాఫికింగ్ వింగ్​ఆఫీసర్లు మల్లేశం, శ్రీనివాస్ ఉన్నారు.

ఆన్ లైన్ జాబ్ అంటూ డబ్బు కాజేత..

కాజీపేట, వెలుగు: సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి, డబ్బులు కాజేస్తున్నారు. ఆన్ లైన్ జాబ్ పేరు చెప్పి ఓ వ్యక్తి వద్ద రూ.79,450 కాజేశాడు. కాజీపేట సీఐ మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం.... కాజీపేట ప్రగతినగర్ కు చెందిన గుండెబోయిన శ్రావణ్ కుమార్ వాట్సాప్ నంబర్ కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఆన్ లైన్ జాబ్ పేరుతో మెసేజ్ వచ్చింది. ఆ లింక్ ను ఓపెన్ చేయగా.. కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే.. ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పారు. ఇలా రూ.79,450లతో వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేశాడు. మళ్లీమళ్లీ అదే కొనాలని అడుగుతుండడంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు.