2026 ఆసియా క్రీడల్లో షూటర్ నీరు ధాండా భారత్‌కు మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల ఇండివిడ్యువల్ ట్రాప్ ఈవెంట్‌లో (women's individual trap event) క్వాలిఫికేషన్ దశ, ఫైనల్స్ రెండింటిలోనూ అగ్రస్థానంలో నిలిచి, చైనాకు చెందిన సన్ యునాంగ్, కువైట్‌కు చెందిన హజర్ అబ్దుల్మాలిక్‌లను ఆమె ఓడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ, ఎనిమిది మంది పాల్గొన్న ఫైనల్‌లో నీరు ధాండా 26 పాయింట్లు సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన సన్, కువైట్‌కు చెందిన హజర్ ఇద్దరూ 21 పాయింట్లతో ముగించగా, ఖతార్‌కు చెందిన రే బాసిల్ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శన:
నీరు ధాండా ఆరంభం నుంచే స్థిరమైన ఆటతీరు కనబర్చింది. ఓపెనింగ్ సిరీస్‌లో మొత్తం ఐదు లక్ష్యాలను ఛేదించి, రెండవ రౌండ్‌లో ఒక లక్ష్యాన్ని కోల్పోయినప్పటికీ, త్వరగా తన లయను తిరిగి అందుకుంది. మూడో సిరీస్‌లో క్లీన్ స్వీప్‌తో తిరిగి అగ్రస్థానానికి చేరుకుని, ఆ తర్వాత కూడా అదే దూకుడుతో ముందుకు సాగింది. నాలుగు సిరీస్‌ల తర్వాత ధాండా 20 షాట్లకు గాను 19 హిట్స్ నమోదు చేసేసింది. 25 షాట్ల తర్వాత సన్ పై 23–21 ఆధిక్యంలో నిలిచారు (ఎలిమినేషన్ కంటే ముందు హజర్ కూడా 21 పాయింట్ల వద్దే ఉన్నారు). ఆఖరి దశలో ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా నీరు ధాండా విజయవంతంగా స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకుంది.
2026లో వరుస విజయాలు:
భారత షూటర్ నీరు ధాండాకు ఈ స్వర్ణ పతకం ఈ ఏడాదిలో సాధించిన మరో భారీ విజయం. ఈ జూలైలో ఇటలీలోని లోనాటోలో జరిగిన ISSF ప్రపంచ కప్ మహిళల ట్రాప్ కాంపిటీషన్‌లో ఆమె తన తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నారు. ఆసియా క్రీడలకు ముందు ఆసియా ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా ఆమె కైవసం చేసుకుంది. ఇండియన్ ఆర్మీ మార్క్స్‌మ్యాన్‌షిప్ యూనిట్ సభ్యురాలైన ఆమె నాయిబ్ సుబేదార్ హోదాలో ఉంది. అంతకుముందు ఈరోజు (సెప్టెంబర్ 29, మంగళవారం) జరిగిన మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజత పతకం రావడంలో కూడా ధాండా కీలక పాత్ర పోషించింది. నీరు ధాండా, ఆషిమా అహ్లావత్, మనీషా కీర్ లతో కూడిన జట్టు 328 పాయింట్లతో రెండవ స్థానంలో నిలవగా, చైనా (346 పాయింట్లు) స్వర్ణం, కువైట్ (325 పాయింట్లు) కాంస్యం సాధించాయి.
భారత్ పతకాల సంఖ్య 47కు పెంపు:
టీమ్ కాంపిటీషన్‌లో నీరు ధాండా 125కి 118 లక్ష్యాలను ఛేదించి భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించింది. తాజా స్వర్ణంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 47కి చేరింది (ఇందులో 5 స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్య పతకాలు ఉన్నాయి). అలాగే భారత రైఫిల్, పిస్టల్ పోటీదారులతో పోలిస్తే, షాట్‌గన్ షూటింగ్‌లో దేశానికి పతకాలు రావడం చాలా తక్కువ. కాబట్టి ఈ విజయం భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోతుంది.
సోదరుడి స్ఫూర్తితో రికార్డు బద్దలు:
తన కజిన్ లక్షయ్ షెయోరాన్ స్ఫూర్తితో నీరు ధాండా షూటింగ్‌ను ప్రారంభించారు. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో లక్షయ్ రజతం సాధించారు. ఇప్పుడు వ్యక్తిగత ఈవెంట్‌లో స్వర్ణం సాధించడంతో ధాండా తన సోదరుడి రికార్డును అధిగమించింది. జపాన్‌లో జరుగుతున్న ఈ క్రీడలలో టీమ్ ఈవెంట్‌లో రజతం, ఇప్పుడు స్వర్ణంతో ఒకే రోజులో రెండు పతకాలను తన ఖాతాలో వేసుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
