- రాజస్తాన్, హర్యానా, కేరళ, బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు లీకేజీ నెట్‌వర్క్
- కేసులో కీలక నిందితుడు మెడికల్ విద్యార్థి శుభమ్ అరెస్ట్
- 15కు చేరిన అరెస్టులు.. కొనసాగుతున్న దర్యాప్తు
న్యూఢిల్లీ: నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్షకు 45 గంటల ముందే ప్రశ్నపత్రం లీకైనట్లు సీబీఐ నిర్ధారించింది. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన మెడికల్ విద్యార్థి శుభమ్ ఖైర్నార్(30 ) ..పేపర్ లీకేజీలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. శుభమ్ ఒక ముఠా నుంచి రూ. 10 లక్షలకు ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసి, దాన్ని హర్యానాకు చెందిన మరో వ్యక్తికి రూ. 15 లక్షలకు విక్రయించినట్లు సీబీఐ గుర్తించింది.
శుభమ్ తన వేషధారణ మార్చినప్పటికీ..పాత ఫొటోల సాయంతో టెక్నాలజీని ఉపయోగించి అధికారులు అతడిని పట్టుకున్నారు. ఈ లీకేజీ నెట్‌వర్క్ రాజస్తాన్‌లోని ప్రధాన కోచింగ్ హబ్ అయిన సికార్ మొదలుకొని హర్యానా, కేరళ, బీహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు విస్తరించిందని అధికారుల దర్యాప్తులో తేలింది.
అంతేగాక, నీట్ పేపర్ లీక్ కేసులో జైపూర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు దినేశ్ బివాల్, మాంగీలాల్ సోదరులు గుర్గావ్‌కు చెందిన యశ్ యాదవ్ నుంచి రూ. 20 లక్షలకు ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసి సికార్‌లోని కన్సల్టెన్సీకి విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దినేశ్ బివాల్ బీజేపీ కార్యకర్త అని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఆయన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. మొత్తంగా రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ)ఈ కేసులో మాస్టర్‌మైండ్ మనీశ్ యాదవ్, రాకేశ్ మాండ్వారియా సహా మొత్తం 15 మందిని అరెస్ట్ చేసింది. కోచింగ్ సెంటర్ల ప్రమేయం, అంతరాష్ట్ర ముఠాల లింకులపై కూడా సీబీఐ దర్యాప్తు జరుపుతోంది.
లీకేజీ బయటపడిందిలా..!
పరీక్షకు రెండు రోజుల ముందు కేరళలో చదువుకుంటున్న ఓ విద్యార్థి..రాజస్తాన్‌లోని సికార్‌లో హాస్టల్ నడుపుతున్న తన తండ్రికి ‘గెస్ పేపర్’ పేరుతో ఒక పీడీఎఫ్ పంపాడు. ఆయన పీడీఎఫ్ పేపర్‌ను తన హాస్టల్‌లోని నీట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్లకు ఇవ్వాలని భావించినప్పటికీ, వారు అప్పటికే పరీక్షా కేంద్రాలకు వెళ్లిపోయారు. పరీక్ష ముగిసి తిరిగి వచ్చిన విద్యార్థులు పీడీఎఫ్ పేపర్‌ను సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కు చూపించారు.
వారు కెమిస్ట్రీలో 108 ప్రశ్నలకు గానూ 45, బయాలజీలో 204 ప్రశ్నలకు గానూ 90 ప్రశ్నలు యథాతథంగా ఉన్నట్లు గుర్తించి పేపర్ లీకేజీ అయినట్లు అనుమానించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు. విచారణ అనంతరం పేపర్ లీకేజీని నిర్ధారించిన ఎన్టీఏ.. కేంద్ర విద్యాశాఖతో చర్చించి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షను మంగళవారం రద్దు చేసింది.
