- థర్డ్ రౌండ్లో సీట్లు మిగలొద్దని ఎన్‌బీఈఎంఎస్ నిర్ణయం
- జనరల్ కేటగిరీకి 276 నుంచి 103 మార్కులకు తగ్గింపు
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 235 నుంచి ఏకంగా మైనస్ 40కి కుదింపు
హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్ సీట్లు వృథా కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ పీజీ – 2025 కౌన్సెలింగ్‌లో థర్డ్ రౌండ్ నాటికి సీట్లు మిగిలిపోవద్దని కటాఫ్ మార్కులను తగ్గించేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈఎంఎస్) మంగళవారం రివైజ్డ్ కటాఫ్‌ను విడుదల చేసింది. క్వాలిఫైయింగ్ మార్కులను భారీగా తగ్గించడంతో వేలాది మంది కొత్తగా కౌన్సెలింగ్‌లో పాల్గొనే చాన్స్ దక్కింది.
కటాఫ్ మార్కుల్లో భారీగా తేడా
గతంలో ఉన్న కటాఫ్ మార్కులను, ఇప్పుడు సవరించిన మార్కులను పోల్చి చూస్తే భారీ తేడా కనిపిస్తున్నది. జనరల్/ఈడబ్ల్యూఎస్ వారికి పాత కటాఫ్ 276 మార్కులు (50 పర్సంటైల్) ఉండగా.. ఇప్పుడది... 103 మార్కులకు (7 పర్సంటైల్) పడిపోయింది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరి వారికి గతంలో 235 మార్కులు (40 పర్సంటైల్) అర్హత ఉండగా.. ఇప్పుడు ఏకంగా మైనస్ -40 మార్కులు (0 పర్సంటైల్) వచ్చినా సీటు కోసం పోటీపడొచ్చు.
ఇక దివ్యాంగులకు గతంలో 255 మార్కులు (45 పర్సంటైల్) కాగా.. ఇప్పుడు... 90 మార్కులకు (5 పర్సంటైల్) తగ్గించారు. కటాఫ్ మార్కులు తగ్గించినా.. ఆగస్టు 19, 2025న విడుదలైన ర్యాంకుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఎన్‌బీఈఎంఎస్ స్పష్టం చేసింది.
కేవలం కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత పరిధిని మాత్రమే పెంచామని, పాత ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఈ సడలింపు 2025–-26 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నది. మార్కులు తక్కువ వచ్చి సీటుపై ఆశలు వదులుకున్న వేలాది మంది స్టూడెంట్లకు ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. తాజా అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం ఎంసీసీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
