ఒక్కో మెడికల్ సీటుకు రూ.60 లక్షలు: దొరికిన బీహార్ సాల్వర్ గ్యాంగ్.. MBBS విద్యార్థే కింగ్ పిన్

ఒక్కో మెడికల్ సీటుకు రూ.60 లక్షలు: దొరికిన బీహార్ సాల్వర్ గ్యాంగ్.. MBBS విద్యార్థే కింగ్ పిన్

NEET Scam: నీట్ ఎగ్జామ్ రాసి కోటి ఆశలతో ఉన్న విద్యార్థులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మే 3న జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. రాజస్థాన్‌లో పేపర్ లీక్ కావడం.. దానికి తోడు బీహార్‌లో భారీస్థాయిలో పేపర్ సాల్వర్ గ్యాంగులు పట్టుబడటంతో కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల శ్రమ ఈ అక్రమార్కుల వల్ల బూడిదలో పోసిన పన్నీరైంది.

ఈ కుంభకోణంలో బీహార్‌లోని నలంద కేంద్రంగా పనిచేస్తున్న ఒక నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక మెడికల్ సీటు కోసం ఈ గ్యాంగ్ ఏకంగా రూ.60 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నలంద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టిన సమయంలో స్కోర్పియో, బ్రెజ్జా వంటి లగ్జరీ కార్లలో ప్రయాణిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వీరిలో విమ్స్ మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి అవధేష్ కుమార్ ముఠాకు మాస్టర్ మైండ్‌గా గుర్తించారు అధికారులు. అతని ఫోన్ పరిశీలించగా చాలా విషయాలు బయటపడ్డాయి.

ఈ గ్యాంగ్ డీల్ ఎలా ఉంటుందంటే.. ఒక అభ్యర్థిని పరీక్షలో పాస్ చేయించి సీటు ఇప్పించడానికి రూ.50 నుండి రూ.60 లక్షలు డీల్ కుదుర్చుకుంటారు. ఇందులో అడ్వాన్స్‌గా రూ.లక్షన్నర నుండి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. డబ్బులు అందిన తర్వాత.. అసలు అభ్యర్థికి బదులుగా పరీక్ష రాయడానికి ఒక సాల్వర్ అంటే తెలివైన విద్యార్థిని సిద్ధం చేస్తారు. ఈ క్రమంలోనే సీతామర్హికి చెందిన డాక్టర్ కుమారుడు హర్షరాజ్ సహా 7 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, నీట్ అభ్యర్థుల ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

2024లో కూడా నీట్ పరీక్షపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అప్పుడు పాట్నా, హజారీబాగ్‌లలో దర్యాప్తు జరగగా పేపర్ లీక్ నిజమేనని తేలింది. ఇప్పుడు 2026లో కూడా అదే సీన్ రిపీట్ కావడంతో ఎన్టీఏపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని.. పాత సెంటర్లలోనే పరీక్ష ఉంటుందని ఎన్టీఏ హామీ ఇచ్చింది నీట్ అభ్యర్థులకు. ఇందుకోసం త్వరలోనే కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేయడంతో పాటు, పరీక్ష రాసిన వారికి ఫీజును కూడా వాపస్ ఇవ్వనున్నారు. కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత రీ-ఎగ్జామ్ తేదీని ప్రకటిస్తారు. మెుత్తానికి కొందరి స్వార్థం లక్షల మంది విద్యార్థులను వేదనకు గురిచేస్తుంది.