దేశవ్యాప్తంగా లక్షల మంది వైద్య విద్యా ఆకాంక్షలకు వేదికైన 'నీట్ యూజీ 2026' రీఎగ్జామ్ సమయం ఆసన్నమైంది. గతంలో జరిగిన పరీక్షపై పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దానిని రద్దు చేసి జూన్ 21న పక్కా భద్రతా ఏర్పాట్ల మధ్య తిరిగి నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి పరీక్ష రూల్స్ లో మార్పులు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి జూన్ 12న ఎన్‌టీఏ ఒక అధికారిక పబ్లిక్ నోటీసును విడుదల చేసింది. ఎన్నో ఏళ్లుగా అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది.
పరీక్ష సమయం పెంపు..
ఈసారి ఎన్‌టీఏ చేసిన మార్పుల్లో అత్యంత కీలకమైనది నీట్ పరీక్ష సమయాన్ని పెంచడం. గతంలో 180 నిమిషాలుగా ఉన్న పరీక్షా సమయాన్ని ఇప్పుడు 195 నిమిషాలకు (3 గంటల 15 నిమిషాలు) పెంచారు. అంటే విద్యార్థులకు అదనంగా మరో 15 నిమిషాల సమయం లభించనుంది. సవరించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 21న మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షా హాల్‌లోకి వెళ్లాక అటెండెన్స్ మార్కింగ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఇన్విజిలేటర్ల సంతకాలు వంటి అధికారిక రికార్డుల ప్రక్రియల వల్ల విద్యార్థులు తమకు కేటాయించిన రాసే సమయాన్ని నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఈ అదనపు 15 నిమిషాలను కేటాయించారు. దీనివల్ల ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ టెన్షన్లు లేకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష పూర్తి చేయవచ్చు.
రఫ్ వర్క్ పేజీలు డబుల్.. ఎడమచేతి వాటం వారికి రిలీఫ్
ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో లెక్కలు, డయాగ్రామ్స్ వేసుకోవడానికి గతంలో రఫ్ వర్క్ కోసం కేవలం రెండు పేజీలు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఈసారి ఆ పేజీల సంఖ్యను నాలుగుకు పెంచారు. దీనివల్ల విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా రఫ్ వర్క్ చేసుకోవచ్చు. కేవలం పేజీల సంఖ్యను పెంచడమే కాకుండా క్వశ్చన్ పేపర్ బుక్‌లెట్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చేశారు. గతంలో రఫ్ పేజీలన్నీ బుక్‌లెట్ చివర్లోనే ఉండేవి. దీనివల్ల ముఖ్యంగా ఎడమచేతి వాటం ఉన్న విద్యార్థులు, వేగంగా లెక్కలు చేసేవారు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెడుతూ.. బుక్‌లెట్ మొదట్లో ఇన్‌స్ట్రక్షన్ పేజీ తర్వాతే రెండు రఫ్ పేజీలను, మిగిలిన రెండు పేజీలను బుక్‌లెట్ చివరన ఉంచారు. ఇంగ్లీష్‌తో పాటు అన్ని ప్రాంతీయ భాషల క్వశ్చన్ పేపర్లలోనూ ఈ కొత్త లేఅవుట్‌ను అమలు చేస్తున్నారు.
అభ్యర్థులకు ఎన్‌టీఏ సూచనలు..
ఈ పరీక్షలో పారదర్శకతను కాపాడేందుకు ఎన్‌టీఏ చిన్న చిన్న మార్పులకైనా పెద్ద పీట వేసింది. పరీక్షా కేంద్రాల వద్ద నిఘాను, నిబంధనలను మరింత కఠినతరం చేశారు. అభ్యర్థులందరూ తమ అడ్మిట్ కార్డ్‌లు, సమాచార బులెటిన్‌లలో ఇచ్చిన సూచనలను క్షుణ్ణంగా చదివి, పరీక్షా సిబ్బందికి సహకరించాలని ఎన్‌టీఏ కోరింది. జూన్ 21న జరగబోయే ఈ హై-స్టేక్స్ ఎగ్జామ్ అభ్యర్థులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చూస్తూనే.. నిష్పాక్షికతను, భద్రతా ప్రమాణాలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. మెుత్తానికి పేపల్ లీక్ వివాదం తర్వాత విద్యార్థుల అసౌకర్యాలకు చిన్న చిన్న పరిష్కారాలతో నీట్ పరీక్ష జరగబోదోంది.
