నీట్ యూజీ రీ-ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల
  • వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న అడ్మిట్ కార్డులు 

హైదరాబాద్, వెలుగు: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–యూజీ) 2026 రీ- ఎగ్జామినేషన్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్ కార్డులను ఆదివారం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌  https://neet.nta.nic.in ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే, హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే ముందే అభ్యర్థులు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను రీఫండ్ ప్రక్రియ కోసం ఒకసారి సరిచూసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.

అడ్మిట్ కార్డులో కేటాయించిన ఎగ్జామ్ సెంటర్‌‌ను ముందే చూసుకోవాలని, ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లోని రూల్స్‌ను క్షుణ్ణంగా చదవాలని స్పష్టం చేసింది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయడంలో ఏవైనా టెక్నికల్ ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు 011–-407–59000 లేదా 011–-692–27700 నంబర్లకు ఫోన్ చేయవచ్చని లేదంటే neetug2026@nta.ac.in కు ఈమెయిల్ పంపవచ్చని పేర్కొంది.