ఖమ్మంలో వర్సిటీ ఇంకెప్పుడు?

ఖమ్మంలో వర్సిటీ  ఇంకెప్పుడు?

వర్సిటీ ఏర్పాటు చేయాలని  నాలుగు దశాబ్దాలుగా  విద్యార్థులు, విద్యావేత్తలు, విద్యార్థి, మహిళా, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత విద్యా అవకాశాలు, విద్యా వనరులు అధికంగా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కోదాడ వంటి సమీప సరిహద్దు జిల్లా విద్యార్థులకు కూడా యూనివర్సిటీ విద్యను సులభంగా  అందించిగల  భౌగోళిక పరిస్థితులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. నలభై వసంతాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి, మంత్రులు మారుతున్నారు.  కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు హామీ మాత్రం హామీగానే మిగిలిపోయింది.

 జిల్లాలో ప్రభుత్వ విశ్వవిద్యాలయం లేకపోవడం వలన ఉమ్మడి జిల్లా విద్యార్థులు చాలా అవకాశాలు కోల్పోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, పేదలు, మొదలైన సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నత విద్యాభ్యాసంలోకి  వస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వలన వారికి ఉన్నత విద్య మరింత చేరువ అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన, ఎన్.టి. రామారావు, చంద్రబాబు నాయుడు, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మొదలుకొని తెలంగాణ బిడ్డ అని పదే పదే  మాట్లాడే కేసీఆర్ వరకు కూడా   ఖమ్మంలో  ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని డజన్ల సార్లు హామీలు ఇచ్చినవారే.  వాళ్ళ అధికార  టర్మ్ పూర్తి అయ్యాయి.  కానీ, ఉమ్మడి ఖమ్మంలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు ఫైల్ ఆవగింజ అంత దూరం కూడా కదలలేదు.

ముగ్గురు మంత్రుల జిల్లా ఇది

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ  ఏర్పాటు కోసం పీడీఎస్​యూ దశలవారీగా అనేక పోరాటాలు, చర్చలు నిర్వహించింది. అనేక కేసులు, అరెస్టులను చవిచూసింది. ముఖ్యమంత్రులు తప్పనిసరిగా యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రకటన చేసేలా ఉద్యమాన్ని నిర్మించింది.  ఇతర  వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి ఐక్య  పోరాటాలలో భాగస్వామ్యం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సరిహద్దు జిల్లాగా ఉండి కూడా ఖమ్మం జిల్లా యువతరం, ప్రజానీకం ఉద్యమ ఉధృతిని ఎత్తి పట్టింది. విద్యార్థుల, ప్రజల అభీష్టాన్ని గుర్తించడంలో, విద్యా రంగ ప్రాధాన్యత గుర్తించడంలో విఫలం చెందిన ప్రభుత్వాల చర్యల వలన  ప్రత్యేక తెలంగాణలో కూడా  మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా  దగా పడింది. అయితే, ఈసారి ఏర్పడిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో  తెలంగాణ ఏర్పడిన  పదేండ్ల తరువాత రాజకీయంగా జిల్లాకి మరో అవకాశం వచ్చింది. ఈ జిల్లా నుంచి  ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరంలో ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ , కొత్తగూడెం కేంద్రంగా మైనింగ్ యూనివర్సిటీ, భద్రాచలం కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు సమగ్ర న్యాయం జరుగుతుంది. 

- వంగూరి  వెంకటేష్, పీడీఎస్​యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి

  • Beta
Beta feature
  • Beta
Beta feature