- చనిపోయిన విషయం దాచి రూ. 3 లక్షలు బిల్లు కట్టించుకున్నరు
- ఆపరేషన్ వికటించి మహిళ మృతి
- హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన
హనుమకొండ సిటీ : బిల్లు కడితే డిశ్చార్జి చేస్తామని చెప్పిన డాక్టర్లు రూ. 3 లక్షలు కట్టిన తర్వాత పేషెంట్ చనిపోయిందనడంతో కుటుంబీకులు, బంధువులు హాస్పిటల్ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామానికి చెందిన సోంపెల్లి రజిత(29)కు కడుపు నొప్పి రావడంతో బుధవారం బాలసముద్రంలోని ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పించారు. పరీక్షించిన డాక్టర్లు గర్భసంచి ఆపరేషన్ చేయాలని చెప్పారు. రెండుసార్లు ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేసి బీపీ పెరగడంతో వెనక్కి తగ్గారు. శుక్రవారం వేకువజామునే రజితకు ఆపరేషన్ చేశారు. రూ.3 లక్షల బిల్లు అయిందని, కడితే రజితను డిశ్చార్జ్ చేస్తామని భర్త రవీందర్ తో చెప్పారు. మధ్యాహ్నం రవీందర్ డబ్బులు కట్టాడు. తర్వాత భార్యను చూపించాలని అడగ్గా చనిపోయినట్లు చెప్పారు. విషయం తెలిసి రవీందర్ బంధువులు, ఫ్రెండ్స్ 20 మంది హాస్పిటల్ కు వచ్చి ఫర్నిచర్ పగలగొట్టారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం, రజిత బంధువుల మధ్య చర్చలు జరిగాయి. దాంతో ఆందోళనను విరమించారు. రజిత కాకతీయ యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీ ఆర్ట్స్ విభాగంలో కాంట్రాక్టు లెక్చరర్ గా చేస్తోంది. ఆమెకు ఏడేళ్లలోపు ఇద్దరు కవలలు(కూతుళ్లు) ఉన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని హనుమకొండ ఎస్సై చెప్పారు.
