వేసవి సెలవులు..కిక్కిరిసిన నెహ్రూ జూపార్క్

వేసవి సెలవులు..కిక్కిరిసిన నెహ్రూ జూపార్క్

హైదరాబాద్: వేసవి సెలవులు అయిపోతున్నాయి..వెదర్‌ కూల్‌గా ఉంది. పైగా ఆదివారం వీకెండ్..ఇన్ని మంచి అనుకూల పరిస్థితులను ఎవరు వదులుకుంటారు. హైదరాబాద్ లో పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే బెస్ట్ హాలిడే స్పాట్ అయిన రాజేంద్రనగర్ లోని నెహ్రూజూపార్క్ సందర్శకులతో కిక్కిరిపోయింది. రికార్డు స్థాయిలో సందర్శకులు వచ్చారు.  

ఆదివారం( మే25) వేసవి సెలవులు, మంచి వాతావరణం ఉండటంతో సందర్శకులు, జంతు ప్రేమికులు జూపార్క్ కు  రద్దీగా పెరిగింది.జూపార్క్ ను సందర్శించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జూపార్క్ లోని జంతువులు, ప్రకృతిని చూసి పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేశారు.  

సాధారణ రోజుల్లో నెహ్రూ జూపార్క్ కు 5వేలనుంచి 8 వేల మంది సందర్శిస్తుంటారు. అయితే ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఆదివారం ఒక్కరోజే దాదాపు 24 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు జూనిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక విదేశీయులు కూడా సందడి చేశారు. వీరితో పాటు ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌, బర్త్‌డే ఫోటో షూట్స్‌ కోసం జూ పార్క్‌నే ప్రధాన స్పాట్‎లుగా ఎంచుకోవడంతో నెహ్రూజూలాజికల్ పార్క్ రద్దీగా మారింది. 

సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జూ యాజమాన్యం ముందస్తుగా ఏర్పాట్లు చేసింది. కౌంటర్లను పెంచింది. ఎంట్రన్స్ దగ్గర టెంట్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది. బ్యాటరీతో నడిచే వాహనాలు, తాగునీటి యూనిట్లను అందుబాటులో ఉంచింది. గతంలో ఇంత రద్దీ ఎప్పుడూ చూడలేదంటున్నారు జూపార్క్ నిర్వాహకులు.