ఊరికి రోడ్డు లేక పిల్లనిస్తలేరు : అమ్మాయిలు ‘నో వే’ అంటున్నారట

ఊరికి రోడ్డు లేక పిల్లనిస్తలేరు : అమ్మాయిలు ‘నో వే’ అంటున్నారట

కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లా. కుమటాతాలూకా మేదిని గ్రామం. సువాసనలు వెదజల్లే ‘మేదిని రైస్‌‌’కు ఫేమస్‌‌. కానీ ఆ ఊళ్లో యువకులను పెళ్లి చేసుకోడానికి మాత్రం అమ్మాయిలు ‘నో వే’ అంటున్నారు. ఆ ఊరు సంబంధమంటే వద్దని ముఖంపైనే వద్దని చెప్పేస్తున్నారు. అంత మంచి పేరున్న ఆ ఊరు యూత్‌‌ను అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నారు? కారణం ఏమై ఉంటుంది?

మేదినీలో 53 ఇళ్లున్నాయి. 400 మంది జనాభా. కుమటా, సిద్ధాపూర్‌‌ హైవేకు 8 కిలోమీటర్ల దూరంలో ఉందా ఊరు. ఇక్కడే ఉంది తిరకాసు. ఆ 8 కిలోమీటర్లు నడిచే వెళ్లాలి. నడవడమంటే మామూలుగా కాదు. ట్రెక్కింగ్‌‌ చేయాలి. అది కూడా దట్టమైన అడవిలో. ఎప్పుడో ఏళ్ల కిందట ఆ ఊరోళ్లే చిన్నగా ఆ దారి వేసుకున్నారు. ఇప్పుడు జీపు వెళ్లేంత దారి ఉంది. కానీ డ్రైవర్‌‌ కంట్రోల్‌‌ తప్పితే సక్కగా లోయలోకే. ఇప్పటికే లాంటి సంఘటనలు చాలా జరిగాయి. అయితే ఎవరికీ గాయాలవలేదని గ్రామస్థులు చెప్పారు. ఇక వర్షం పడితే అంతే సంగతులు. వెహికల్స్‌‌ వెళ్లేందుకు అస్సలు కుదరదు. నడిచే వెళ్లాలి. ఆ బురదలో నడవడం కూడా ప్రమాదమే.

కరెంటుంది.. రోడ్డేది?

మేదినీలో ప్రైమరీ స్కూలు, కరెంటు సప్లై తప్ప ఇంకేమీ లేవని గ్రామస్థులు చెబుతున్నారు. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ఊరొస్తారని, రోడ్డేయిస్తామని హామీ ఇస్తారని, కానీ అది ఇప్పటికీ జరగలేదని అంటున్నారు. రోడ్డు లేని ఆ ఊరికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లికావాల్సిన వాళ్లు ఆ ఊళ్లో 28 మంది ఉన్నారని అంటున్నారు. ఇక్కడి ప్రజలు మేలు రకం, మంచి వాసననిచ్చే మేదిని రకం రైస్‌‌ను పండిస్తున్నా ట్రాన్‌‌పోర్టేషన్‌‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకొందరు  ఎక్కువగా అడవిలో దొరికే ఉత్పత్తులను అమ్మి జీవనం సాగిస్తున్నారు.