
హైదరాబాద్, వెలుగు: ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్, ఆపరేషన్స్ పరిశ్రమలకు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లను అభివృద్ధి చేసే జర్మనీ కంపెనీ నెమెట్షెక్ గ్రూప్, హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) మంగళవారం (సెప్టెంబర్ 09) ప్రారంభించింది. ఐఎస్ఎఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ, ఐటీ సలహాదారు జేఏ చౌదరి, నెమెట్షెక్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూయిస్ ఓఫ్వర్స్ట్రోమ్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా వచ్చారు.
ఈ కొత్త కార్యాలయం భారతదేశంలో నెమెట్షెక్ వ్యూహాత్మక విస్తరణకు ముఖ్యమైన మైలురాయి అని కంపెనీ తెలిపింది. ఇక్కడి ఆర్ అండ్‌డీ సెంటర్ గ్లోబల్ టీమ్స్‌తో కలిసి పనిచేస్తుందని తెలిపింది. కొత్త జీసీసీలో ఆర్ అండ్ డీ టీమ్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్వోసీ), జనరల్, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి.
దీని సీటింగ్కెపాసిటీ 250 అని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా లూయిస్ మాట్లాడుతూ, ప్రపంచంలోని చాలా భవనాలను తమ సాఫ్ట్‌వేర్‌తో తయారు చేశారని తెలిపారు. ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నామని, ప్రైవేటు కంపెనీలకూ సేవలు అందిస్తున్నామని వివరించారు.