చరిత్ర సృష్టించిన నేపాల్‌ జట్టు.. 2024 టీ20 వరల్డ్ కప్‌‌కు అర్హత

చరిత్ర సృష్టించిన నేపాల్‌ జట్టు.. 2024 టీ20 వరల్డ్ కప్‌‌కు అర్హత

ఓవైపు హోరీహోరీగా వరల్డ్ కప్ పోరు జరుగుతుంటే.. మరోవైపు నేపాల్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచకప్‌లో ఆడాలనే తన కలను సాకారం చేసుకుంది. అమెరికా, వెస్టిండీస్‌‌లు సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న 2024 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఆసియా క్వాలిఫయర్స్ పోరులో యూఏఈను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన నేపాల్‌.. తొలిసారి టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 134 పరుగులు చేయగా.. నేపాల్‌ 2 వికెట్లు కోల్పోయి మరో 17 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్‌ బ్యాటర్లలో ఆసిఫ్ షేక్(64 నాటౌట్‌) హాఫ్ సెంచరీ చేయగా.. ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌(34) పర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో బెహ్రయిన్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఒమన్ సైతం 2024 టీ20 వరల్డ్ కప్‌ కు అర్హత సాధించింది.

పోటెత్తిన అభిమానం

ఇదిలావుంటే, ఈ మ్యాచ్ చూసేందుకు నేపాల్ అభిమానులు పోటెత్తారు. స్టేడియం చిన్నదైనా, సౌకర్యాలు లేకపోయినా వేలసంఖ్యలో మ్యాచ్ చూసేందుకు తరలివచ్చారు. స్టేడియం చుట్టుప్రక్కల ఉన్న పెద్ద పెద్ద భవనాలు సైతం అభిమానులతో కిటకిటలాడాయి. ఆ దృశ్యాలు భారత అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.