పేరు సచిన్‌ది.. విగ్రహం ఆస్ట్రేలియా క్రికెటర్‌ది.. బీసీసీఐ అద్భుతం అంటున్న నెటిజన్స్

పేరు సచిన్‌ది.. విగ్రహం ఆస్ట్రేలియా క్రికెటర్‌ది.. బీసీసీఐ అద్భుతం అంటున్న నెటిజన్స్

రెండ్రోజుల క్రితం భారత మాజీ దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ విగ్రహావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సహా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ కార్యదర్శి జై షా, సచిన్ కుటుంబసభ్యులు, వందలాది మంది క్రికెట్ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇంత అంగరంగ వైభవంగా జరిగిన క్రికెట్ దేవుడి విగ్రహావిష్కరణ చివరకు వివాదాస్పదమవుతోంది. విగ్రహం సచిన్‌ది కాదని భారత అభిమానులు కోడై కూస్తున్నారు. సచిన్‌ పేరు చెప్పి.. ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్ స్మిత్ విగ్రహం పెట్టారని ఆరోపిస్తున్నారు. వీరి మాటల్లో వాస్తవం లేకపోలేదు. విగ్రహాన్ని కాస్త పరిశీలించి చూస్తే.. స్టీవ్ స్మిత్ ముఖాన్ని పోలి ఉంది. ఈ విగ్రహాన్ని ఇద్దరి ముఖ కవలికలతో పోలుస్తూ నెటిజెన్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

ప్రమోద్ కాంబ్లే

అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రమోద్ కాంబ్లే అని శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేశారట. దీంతో ఆయన పేరు కూడా మార్మోగుతోంది. ఇంత అద్భుతంగా చెక్కినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఆయనకు బహుమతి ప్రధానం చేయాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. అలాగే, బీసీసీఐ పెద్దల తెలివితేటలను కూడా గొప్పగా వర్ణిస్తున్నారు. మొత్తానికి బీసీసీఐ చేసిన చెత్త పని సచిన్ కు చెడ్డ పేరు తెస్తోంది.