ఇంటి ఓనర్ ను తాళ్లతో కట్టేసి చోరీ చేసిన నేపాలి కపుల్స్..కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

ఇంటి ఓనర్ ను తాళ్లతో కట్టేసి చోరీ చేసిన నేపాలి కపుల్స్..కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • 25 తులాల బంగారం, రూ.23 లక్షలు అపహరణ

కంటోన్మెంట్, వెలుగు: వసతి కల్పించి పని కల్పించిన ఇంటి యజమానిని నేపాలి దంపతులు బంధించి, చిత్రహింసలకు గురి చేసి భారీ చోరీకి  పాల్పడ్డారు. ఈ ఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తిరుమలగిరి ఏసీపీ రమేశ్, కార్ఖానా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో అనురాధ తెలిపిన ప్రకారం.. ఆర్మీ రిటైర్డ్ కర్నల్ కెప్టెన్ గిరి(76) సికింద్రాబాద్ కార్ఖానా గన్ రాక్ ఎన్​క్లేవ్ లో నివసిస్తున్నారు. ఈయన ఇంట్లో నేపాల్ కు చెందిన రాజేంద్ర సాహి, పూజ దంపతులు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి యజమాని చేతులు, కాళ్లు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. చిత్రహింసలకు గురిచేసి, బెదిరించి 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.23 లక్షలు ఎత్తుకెళ్లారు. పథకం ప్రకారం భార్యాభర్తలిద్దరితో పాటు మరో నలుగురు  కలిసి దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.