మరో దేశానికి పాకిన ఒమిక్రాన్ వేరియంట్

మరో దేశానికి పాకిన ఒమిక్రాన్ వేరియంట్

దక్షిణాఫ్రికాలో గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఒక్కొక్క దేశానికీ వ్యాపిస్తోంది. ఇప్పటికే దాదాపు 30 దేశాల్లో ప్రవేశించిన ఈ వేరియంట్ కొత్తగా నేపాల్‌లోకి ఎంటరైంది. సోమవారం ఆ దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని నేపాల్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. నేపాల్‌లో తొలిసారి ఒమిక్రాన్‌ కేసులను గుర్తించామని ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆ ఇద్దరూ నేపాల్‌కు చెందిన వాళ్లు కాదు. వారిద్దరూ కొద్ది రోజుల క్రితం విదేశాల నుంచి నేపాల్‌కు రాగా, వారికి టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆదివారం రాత్రి వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ అని తేలిందని నేపాల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. ఇద్దరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని, వారిలో ఒకరి వయసు 66 ఏండ్లు, మరొకరి వయసు 71 ఏండ్లు అని చెప్పారు. వాళ్లు నవంబర్ 19న నేపాల్‌కు వచ్చారని, ఆ సమయంలో టెస్టు చేస్తే నెగటివ్ వచ్చిందని తెలిపారు. అయితే మళ్లీ నవంబర్ 23న కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌లో ఉంచి మరోసారి టెస్టులు చేశామన్నారు. 

భారత్‌లో ఇవాళ మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు

భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో రెండు, రాజస్థాన్‌లో తొమ్మిది, గుజరాత్, ఢిల్లీల్లో ఒక్కొక్కటి, మహారాష్ట్రలో ఎనిమిది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఇవాళ మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి ముంబైకి వచ్చిన 36 ఏళ్ల వ్యక్తితో పాటు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పదికి చేరగా దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 23కి పెరిగింది.