NPL vs WI: 83 పరుగులకే ఆలౌట్.. నేపాల్ చేతిలో ఘోరంగా ఓడిన వెస్టిండీస్.. సిరీస్ కూడా పోయింది

NPL vs WI: 83 పరుగులకే ఆలౌట్.. నేపాల్ చేతిలో ఘోరంగా ఓడిన వెస్టిండీస్.. సిరీస్ కూడా పోయింది

నేపాల్ క్రికెట్ లో ఇదొక సంచలనం. తొలిసారి పూర్తి సభ్య దేశంతో టీ20 సిరీస్ ఆడడమే కాకుండా ఏకంగా సిరీస్ గెలిచింది. వెస్టిండీస్ తో మూడు జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. క్రికెట్ లో ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న నేపాల్ క్రికెట్ లో ఇదొక చిరస్మరణీయం. మరోవైపు రెండు సార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్ లుగా చరిత్ర ఉన్న వెస్టిండీస్ అవమానకర రీతిలో సిరీస్ ఓడిపోవడం ఆ దేశాన్ని తీవ్ర విచారానికి గురి చేస్తుంది. 

ఈ సిరీస్ విషయానికి వస్తే తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ కు షాకిచ్చి సంచలన విజయాన్ని అందుకున్న నేపాల్.. తమ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ రెండో టీ20లోనూ గెలిచింది. సోమవారం (సెప్టెంబర్ 29) షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండు టీ20 మ్యాచ్ లో భారీ విజయంతో విండీస్ జట్టును చిత్తుగా ఓడించింది. కేవలం 83 పరుగులకే వెస్టిండీస్ జట్టును ఆలౌట్ చేసి 90 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించిన నేపాల్.. రెండో టీ20లో కూడా గెలవడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టీ20 మంగళవారం (సెప్టెంబర్ 30) జరుగుతుంది.  

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. పవర్ ప్లే లో విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 43 పరుగులకే నేపాల్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసిఫ్ షేక్, సందీప్ జోరా జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు 100 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఈ  క్రమంలో ఆసిఫ్ షేక్ (68), సందీప్ జోరా (63) తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 174 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 83 పరుగులకే ఆలౌట్ అయింది. మీడియం పేసర్ మొహమ్మద్ ఆదిల్ ఆలం 24 పరుగులకు 4 వికెట్లు పడగొట్టడంతో పాటు కుషాల్ భూర్తెల్ మూడు వికెట్లు పడగొట్టి నేపాల్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.