వ్యాపారి ఇంట్లో వజ్రాభరణాల దొంగతనం వంట మనిషి పన్నాగమే..!

వ్యాపారి ఇంట్లో వజ్రాభరణాల దొంగతనం వంట మనిషి పన్నాగమే..!
  • నేపాలీ ముఠాకు రిమాండ్
  • ఇండో-నేపాల్ సరిహద్దులో దొరికిన ఇద్దరు
  •  పరారీలో మరో ఇద్దరు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్​లో జరిగిన రూ.1.3 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. వంట మనిషినే నిందితుడిగా తేల్చి, నేపాలీ దొంగల ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇన్​స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం.. నందగిరి హిల్స్​కు చెందిన వ్యాపారి రవీంద్ర శర్మ ఇంట్లో నేపాల్​కు చెందిన భూపేందర్ షాహి అలియాస్ భువన్ (22) వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 5న ఇంటి ఓనర్ బయటకు వెళ్లగానే ఇంట్లో పనిచేసే ఇతర సిబ్బందికి కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడు. 

అనంతరం ఇంటి బయట వేచి ఉన్న తన సహచరులను లోపలికి పిలిపించి, ఇనుప రాడ్, స్క్రూ డ్రైవర్​తో లాకర్​ను బలవంతంగా తెరిచి నగలు దోచుకున్నారు. ఘటనాస్థలంలో నిందితులు వదిలివెళ్లిన మొబైల్ ఫోన్, సాంకేతిక సమాచారం ఆధారంగా ఇండో-–నేపాల్ సరిహద్దు వద్ద భూపేందర్ షాహి, కృష్ణ చంద్ (23)ను అదుపులోకి తీసుకుని రూ.1.3 కోట్ల విలువైన నగలు రికవరీ చేశారు. వీరిద్దరిని బుధవారం రిమాండ్​కు తరలించారు. ప్రధాన సూత్రధారి జిబాన్ చంద్​తో పాటు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు ఇన్​స్పెక్టర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గృహయజమానులు ఇంటి సిబ్బంది నియామకంలో పూర్తి వివరాలు ధ్రువీకరించుకోవాలని పోలీసులు సూచించారు.