హైదరాబాద్ బషీర్ బాగ్‌లో ఒంటరిగా వెళ్తున్న ఓ యువతి పట్ల కొందరు కిరాతకులు అత్యంత అసభ్యంగా ప్రవర్తించారు. మే 27 బుధవారం రాత్రి బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఈ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న యువతిని చూసి... ఐదుగురు నేపాలీ యువకులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపైనే ఆమె చేయి పట్టి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువతి.. ధైర్యం చేసి గట్టిగా కేకలు వేసింది.
యువతి అరుపులు విన్న చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ఐదుగురు నేపాలీలను చుట్టుముట్టి నిర్బంధించారు. నడిరోడ్డుపైనే వారికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితులను అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.
పోలీసుల విచారణలో వీరంతా స్థానికంగా ఉండే ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పని చేస్తున్నట్లు తేలింది. నిందితులను సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ నేవుపనేలుగా గుర్తించారు. ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు... దర్యాప్తును వేగవంతం చేశారు. నడిరోడ్డుపై, అది కూడా పోలీస్ కార్యాలయం ముందే ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
