Sabar Bonda: నెట్‌ఫ్లిక్స్‌లో సైలెంట్ హిట్ 'సబర్ బోండా'.. మనసును తడిమే స్వచ్ఛమైన ప్రేమకథ.

Sabar Bonda: నెట్‌ఫ్లిక్స్‌లో సైలెంట్ హిట్ 'సబర్ బోండా'.. మనసును తడిమే స్వచ్ఛమైన ప్రేమకథ.

నెట్‌ఫ్లిక్స్‌లో సైలెంట్‌గా స్ట్రీమింగ్ అవుతూ, ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్న మరాఠీ చిత్రం ‘సబర్ బోండా’.  రోహన్ పరశురామ్ కనవాడే దర్శకత్వం వహించిన ఈ సినిమా, పల్లెటూరి నేపథ్యంతో సాగే ఒక సున్నితమైన భావోద్వేగ ప్రయాణంలా సాగుతుంది. ఈ మూవీలో భూషణ్ మనోజ్, సూరజ్ సుమన్. జయ శ్రీ జగ్హాప్ నటించారు.

కథా నేపథ్యం

ముంబైలోని ఒక కాల్ సెంటర్‌లో పనిచేసే మధ్యతరగతి యువకుడు ఆనంద్ (భూషణ్ మనోజ్). అతని తండ్రి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో మరణిస్తాడు. తండ్రి అంత్యక్రియల కోసం ఆనంద్ తన తల్లి సుమన్ (జయశ్రీ జగ్తాప్)తో కలిసి సొంతూరు ఖర్షిందేకి వెళ్తాడు. అక్కడి గ్రామ ఆచారాల ప్రకారం, తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు 10 రోజుల పాటు కొన్ని కఠినమైన నియమాలను పాటించాలి. గడ్డం తీయకూడదు, నేల మీదే పడుకోవాలి, మధ్యాహ్నం భోజనం తర్వాత కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ క్రమంలోనే బంధువులంతా ఆనంద్‌ను పెళ్లి గురించి ప్రశ్నించడం మొదలుపెడతారు.

బంధాల కలయిక

అదే సమయంలో ఆనంద్ తన చిన్ననాటి స్నేహితుడు బల్య (సూరజ్ సుమన్)ని కలుస్తాడు. బల్య ఊరిలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటుంటాడు. ఆనంద్ నగర జీవనానికి అలవాటు పడితే, బల్య పల్లెటూరి స్వచ్ఛతను మోస్తుంటాడు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ఒక ఉమ్మడి రహస్యం ఏమిటంటే.. ఇద్దరూ 'గే' (Gay). సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో బల్య పెళ్లికి దూరంగా ఉంటాడు. ఆ 10 రోజుల ఏకాంతంలో ఇద్దరూ తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను, ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలను పంచుకుంటారు.

దర్శకుడు రోహన్ ఈ సినిమాలో గ్రామీణ ఆచారాలకు,వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న సంఘర్షణను చాలా సహజంగా చూపించారు.  ఆనంద్‌గా భూషణ్ మనోజ్ ఆందోళనను, బల్యగా సూరజ్ సుమన్ అమాయకత్వాన్ని అద్భుతంగా పండించారు. పల్లెటూరి వాతావరణం, అక్కడి నిశ్శబ్దాన్ని కెమెరాలో బంధించిన తీరు సినిమాకు ప్రాణం పోసింది. సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూనే, తమ ఉనికిని ఎలా చాటుకోవాలి? సమాజం విధించిన గీతలను దాటి ఆనంద్, బల్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనేదే ఈ చిత్ర ముగింపు. కేవలం ఒక వర్గానికి చెందిన సినిమాగా కాకుండా, మానవ సంబంధాల లోతును తడిమే చిత్రంగా 'సబర్ బోండా' నిలుస్తుంది.