 
                                    టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ పై విమర్శల వర్షం ఎక్కువగా కురుస్తుంది. ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్లలో ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకుంటున్న క్రికెటర్లు ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు జస్ప్రీత్ బుమ్రా కాగా ఇంకొకరు శుభమాన్ గిల్. బుమ్రా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో తనని తాను నిరూపించుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఇండియాకు బెస్ట్ బౌలర్ గా కితాబులందుకుంటున్నాడు. మరోవైపు గిల్ మాత్రం ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో తన ఉనికిని చాటుకుంటున్నాడు.
శుభమాన్ గిల్ ను బీసీసీఐ బాగా నమ్మినట్టు తెలుస్తుంది. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత పెద్దగా అనుభవం లేకపోయినా టెస్ట్ కెప్టెన్సీ ఇచ్చారు. ఈ నిర్ణయం ఆశ్చర్యం కలిగించినా ఇంగ్లాండ్ సిరీస్ లో గిల్ బ్యాటర్ గా.. కెప్టెన్ గా ఆకట్టుకున్నాడు. 752 పరుగులు చేయడంతో పాటు సిరీస్ ను 2-2 తో సమం చేయగలిగాడు. ఆ తర్వాత ఆసియా కప్ లో అనూహ్యంగా గిల్ ను తీసుకొచ్చారు. ఏడాదిపాటు టీ20 ఫార్మాట్ ఆడకపోయినా వైస్ కెప్టెన్సీ అప్పగించి ప్లేయింగ్ 11 లో చోటు ఇచ్చారు. ఆసియా కప్ లో విఫలమైన ఈ టీమిండియా యువ బ్యాటర్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లోనూ పెద్దగా రాణించడం లేదు.
వన్డేల విషయానికి రోహిత్ శర్మ లాంటి సక్సెస్ ఫుల్ కెప్టెన్ ను తప్పించి గిల్ ను కెప్టెన్ గా ప్రకటించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ నెటిజన్స్ కు బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం నచ్చలేదు. కెప్టెన్ గా తొలి వన్డే సిరీస్ ను గిల్ కోల్పోయాడు. అంతేకాదు బ్యాటింగ్ లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో గిల్ ను బలవంతంగా జట్టులో ఉంచుతున్నారని.. ఈ ప్రభావం కొంతమంది స్టార్ క్రికెటర్ల కెరీర్ మీద పడుతుందని ఫ్యాన్స్ గిల్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వన్డేల్లో గిల్ విఫలమవుతున్నాడని అతడి స్థానంలో జైశ్వాల్, అభిషేక్ శర్మ లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ను ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సూపర్ ఫామ్ లో జైశ్వాల్ మూడు ఫార్మాట్ లు ఆడడానికి అర్హుడు. అయితే అతనికి కేవలం టెస్టుల్లో మాత్రమే చోటు దక్కుతుంది. ముఖ్యంగా గిల్ ను టీ20లోకి తీసుకొచ్చి జైశ్వాల్ కు అన్యాయం చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీ20 ఫార్మాట్ లో ఓపెనర్ గా అద్భుతంగా ఆడుతున్న శాంసన్ ను గిల్ కారణంగా మిగిలి ఆర్డర్ కు పరిమితం చేశారని.. ఇప్పుడు శాంసన్ కు ఒక ఖచ్చితమైన బ్యాటింగ్ స్థానం లేదని టీమిండియా యాజమాన్యంపై నిప్పులు కురిపిస్తున్నారు.
టెస్టుల్లో గిల్ ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి విరాట్ కోహ్లీని బలవంతంగా రిటైర్మెంట్ చేయించారని వితండ వాదన చేస్తున్నారు. వన్డేల్లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన తర్వాత కూడా సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్ ట్రాక్ మీద మాత్రమే గిల్ ఆడతాడనే పేరుంది. ఈ విమర్శలు అన్ని ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్, టీ20 మ్యాచ్ ల్లో విఫలమైన తర్వాత వస్తున్నాయి. మూడో టీ20లో గిల్ ఆడకపోతే మాత్రం అతను మరినిపై ఒత్తిడి పెరగడం ఖాయం.ఇలాంటి కఠిన సవాలును గిల్ ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.

 
         
                     
                     
                    