రియల్ హీరోకు ఫిదా.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న అధికారులు

రియల్ హీరోకు ఫిదా.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న అధికారులు

విధి నిర్వహణలో పోలీసులు తమ కర్తవ్యాన్ని మరవడంలేదు. బాధ్యతగా విధులు నిర్వహిస్తూ అందరితో సభాష్ అనిపించుకుంటున్నారు.  ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఓ కానిస్టేబుల్ అంబులెన్స్ కు దారిచ్చి ప్రాణం కాపాడారు. నవంబర్​ 4 సాయంత్రం అబిడ్స్ పోస్టాఫీస్ దగ్గరలో హెవీ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ మధ్య ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పరుగు పెడుతున్నాడు ఆయన వెనుక ఒక అంబులెన్స్ హారన్ మోగిస్తూ వెళ్తోంది , బండ్లమీద వెళ్లే వాళ్లని పక్కకి జరగమని ఓపికగా చెబుతూ అలా దాదాపు ఒకటిన్నర కిలోమీటరు పరుగుతీసి ఎలాగైతేనేం ఆ అంబులెన్స్‌‌‌‌ని ట్రాఫిక్ మధ్యనుంచి పంపించాడు. అబిడ్స్ నుంచి తిరిగి వస్తున్న ఆ ట్రాఫిక్ పోలీస్‌‌‌‌ని చూస్తూ రోడ్డు మీద ఉన్న జనం అందరూ చప్పట్లు కొట్టారు.  వెహికల్స్ మీద ఉన్నవాళ్లు సెల్యూట్ చేశారు.

తాజాగా మరోకానిస్టేబుల్ జోరు వర్షంలో విధులు నిర్వహించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.  తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ముత్తురాజా జోరువానని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ని ప్రశంసిస్తూ ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అంతేకాదు అంత పెద్ద వానలో బిజీ రోడ్డులో అత్యంత అంకితభావంతో విధులను నిర్వర్తిస్తున్న ముత్తురాజాకు ఉన్నతాధికారులు  ప్రశంసల వర్షం కురిపించారు. రియల్ హీరో డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తెస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.