గోవాలో పొత్తుల ఎత్తులు

గోవాలో పొత్తుల ఎత్తులు
  • ఎంజీపీతో బీజేపీ చర్చలు 
  • ఆప్, టీఎంసీతో కాంగ్రెస్ సంప్రదింపులు

పనాజీ: గోవాలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. పెద్ద పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేవని ఎగ్జిట్ పోల్స్ తేల్చడంతో ఆ పార్టీలు పొత్తులకు చర్చలు మొదలుపెట్టాయి. చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు అవసరం. అయితే బీజేపీకి 15+, కాంగ్రెస్ కు 15+, టీఎంసీ నేతృత్వంలోని కూటమికి 5 వరకు, ఇతరులకు 5 వరకు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో టీఎంసీ కూటమి, ఇండిపెండెంట్ల పాత్ర కీలకంగా మారనుంది. టీఎంసీ కూటమిలోని మహారాష్ట్రవాడి గోమాంతక్ పార్టీ (ఎంజీపీ) కింగ్ మేకర్ గా మారనుంది. 

కాంగ్రెస్​కు ఆప్ గ్రీన్ సిగ్నల్!    
ఆప్, టీఎంసీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఆ రెండు పార్టీలను సంప్రదించింది. చర్చల కోసం సీనియర్ నేతలు పి.చిదంబరం, డీకే శివకుమార్ లను రంగంలోకి దించింది. ‘‘గోవాలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన అన్ని పార్టీలతో పొత్తుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఆప్, టీఎంసీలతో కలిసేందుకు రెడీగా ఉన్నాం” అని కాంగ్రెస్ గోవా ఇన్ చార్జ్ దినేశ్ గుండురావు చెప్పారు. తమ పార్టీకి మెజార్టీ వస్తుందని, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ కూడా సిద్ధంగా ఉంది. 

బీజేపీకి ఎంజీపీ ఓకే!
ఎంజీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీతో చర్చలు ప్రారంభించింది. ఎంజీపీతో బీజేపీ హైకమాండ్ చర్చలు జరుపుతోందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. ‘‘మా పార్టీకి 22 సీట్లకు పైగా వస్తాయనే ధీమా ఉంది. ఒకవేళ తక్కువ చేస్తే ఏం చేయాలనే దానిపై హైకమాండ్ ఆలోచిస్తోంది. అందుకే ఎంజీపీ, ఇండిపెండెంట్ల మద్దతు కోరుతోంది” అని తెలిపారు. 2017లో ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, ఇండిపెండెంట్లతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనోహర్ పారికర్ చనిపోయినంక సీఎం అయిన సావంత్.. కేబినెట్ నుంచి ఇద్దరు ఎంజీపీ మంత్రులను తొలగించారు. దీంతో ఈసారి టీఎంసీతో కలిసి ఎంజీపీ పోటీ చేసింది. అయితే బీజేపీకి మద్దతు ఇవ్వబోమని ఎంజీపీ చెప్పలేదు. తన లీడర్ షిప్ పై హైకమాండ్​కు నమ్మకముందని, మళ్లీ తనకే పగ్గాలు అప్పగిస్తుందని సావంత్ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ క్యాంప్ స్టార్ట్.. 
రాష్ట్రంలో మళ్లీ హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. 2017 నాటి సీన్ రిపీట్ కాకుండా, రిజల్ట్ కు ముందే క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టింది. తమ క్యాండిడేట్లను నార్త్ గోవాలోని రిసార్ట్ కు పంపింది.