స్కై వే పనుల పర్యవేక్షణకు..కొత్త బోర్డు ఏర్పాటు

స్కై వే పనుల పర్యవేక్షణకు..కొత్త బోర్డు ఏర్పాటు
  • స్కై వే పనుల పర్యవేక్షణకు..కొత్త బోర్డు ఏర్పాటు
  • డీ-మార్కేషన్ ​పనులు చేపట్టేందుకు సన్నాహాలు

కంటోన్మెంట్, వెలుగు :  సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ ప్రాంతంలో  నిర్మిస్తున్న రెండు స్కైవే పనుల పర్యవేక్షణకు కొత్త బోర్డు ఏర్పాటు ఏర్పాటైంది. జాతీయ రహదారి -44లో భాగంగా పరేడ్ గ్రౌండ్ నుంచి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, జింఖానా గ్రౌండ్ నుంచి సుచిత్ర వరకు రెండు మార్గాల్లో  స్కైవేల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనులను పర్యవేక్షించడానికి రక్షణ శాఖ ఆదేశాల మేరకు అధికారుల బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో లోకల్ ​మిలటరీ అథారిటి నుంచి  సీనియర్ డిఫెన్స్ అధికారులు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తెలంగాణ సర్కిల్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్ అధికారులు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్  అథారిటీ ఆఫీసర్లు సభ్యులుగా ఉన్నారు. స్కైవేల నిర్మాణానికి సంబంధించిన భూ బదలాయింపు, ఆస్తులు కోల్పోతున్న వారికి నష్టపరిహారం తదితర అంశాలను వీరు పర్యవేక్షించనున్నారు. 

బాధితులకు సంబంధించిన భూమిని హెచ్ఎండీఏకు బదిలీ చేసే విధివిధానాలను కూడా కమిటి ప్రతినిధులు అధ్యయనం చేసి రిపోర్టును డిఫెన్స్​ మినిస్ట్రీకి అందజేయనున్నారు. కాగా.. త్వరలోనే డీ మార్కేషన్​ పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రెండు స్కైవేలను నిర్మించాలని 2014లో తొలిసారిగా గత రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. దీనిపై పలుమార్లు రాష్ర్ట ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఎట్టకేలకు స్కైవేలను నిర్మించేందుకు స్థలాలు ఇవ్వడానికి అంగీకరించిన రక్షణ శాఖ  హెచ్ఎండీఏకు గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. దీంతో రూ.2,232 కోట్ల వ్యయంతో  సికింద్రాబాద్​ నుంచి తూముకుంట వరకు నిర్మించనున్న ఆరు లైన్ల ఎలివేటెడ్​ కారిడార్ కు గత నెల 7న సీఎం రేవంత్​రెడ్డి భూమి పూజ చేశారు. కాగా.. స్కైవేల నిర్మాణం కోసం 60 మీటర్ల మేరకు రహదారులను విస్తరించనున్నారు. రెండు చోట్ల టన్నెల్స్​ నిర్మించనున్నారు.