కన్నబిడ్డను ఎండలో వదిలేసిన కసాయి తల్లి

కన్నబిడ్డను ఎండలో వదిలేసిన కసాయి తల్లి

కుత్బుల్లాపూర్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశివును ఓ ఇంటిపై వదిలి వెళ్లిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు మండుటెండను తాళలేక మరోవైపు ఊపిరాడక ఆ శిశువు చనిపోయింది. 

జీడిమెట్ల పీఎస్ పరిధిలోని అయోధ్య నగర్ లో ఉదయం ఓ ఇంటిపై అప్పుడే పుట్టిన ఆడపిల్లను ఓ తల్లి వదిలేసి వెళ్లిపోయింది. పాప ఏడ్పు విన్న స్థానికులు ఆ శిశువును ఇంటిపై నుంచి కిందకు దించి.. చుట్టుపక్కల వారిని విచారించారు. ఎవరూ సంబంధంలేదని చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పాపను షాపూర్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. ఎండలో దాదాపు నాలుగైదు గంటలు ఏడుస్తుండటం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతోనే చిన్నారి ఊపిరాడక చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.