నేతల మధ్య విభేదాలతో కాంగ్రెస్ పరేషాన్

నేతల మధ్య విభేదాలతో కాంగ్రెస్ పరేషాన్

కాంగ్రెస్ పార్టీలో కొత్త సమస్య వచ్చిపడింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ వర్సెస్ సీనియర్ల గొడవ ఢిల్లీకి చేరింది. ఇక కొత్తగా ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాలనీ సొంత పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు డిమాండ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. నేతల మధ్య విభేదాలతో పరేషాన్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు ఎపిసోడ్ కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఈ పంచాయితీ ఢిల్లీకి చేరింది. సీనియర్లు రేవంత్ వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి హస్తినకు క్యూకట్టారు సీనియర్ లీడర్లు.

మరో ఇష్యూ తెరపైకి

రేవంత్ ఇష్యూతోనే పార్టీ గ్రాఫ్ పడిపోతుందని కాంగ్రెస్ క్యాడర్ తలలు పట్టుకుంటోంది. అయితే కొత్తగా మరో ఇష్యూ తెరపైకి వచ్చింది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు. ఇటీవల హోటల్ పార్క్ హయత్ లో వీరు సమావేశమయ్యారు. ఇందులో కొన్ని తీర్మానాలు చేశారు. ఉదయ్ పూర్ లో ఏఐసీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 50 శాతం టికెట్లు తమకు కేటాయించాలంటున్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు. పార్టీ పదవుల్లో సైతం ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ సీట్లల్లో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతోందంటున్నారు. ఇక ఇంటికి ఒక్కటే టికెట్, ఒక్కరికి ఒకటే పదవి అని ఉదయ్ పూర్ డిక్లరేషన్ చెబుతుంటే.. రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఫైర్ అవుతున్నారు.

తెలంగాణలో ఉదయ్ పూర్ డిక్లరేషన్

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్నాయి. తెలంగాణలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయకుంటే.. మరింత నష్టం జరిగే ఛాన్స్ ఉందని నేతలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు గ్రౌండ్ లెవల్ లో సమావేశాలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని కొత్తగా ఎన్నికైన ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గేను కోరాలని చూస్తున్నారు... నేతల మధ్య విభేదాలతో పార్టీకి నష్టం జరుగుతోందని ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందుతోంది. తాజాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు సమావేశం కావడంపై పార్టీలో చర్చ జరుగుతోంది.