ఇరాన్ అదుపులో 18 మంది ఇండియన్స్

ఇరాన్ అదుపులో 18 మంది ఇండియన్స్

టెహ్రాన్‌‌‌‌/లండన్/న్యూఢిల్లీ: గల్ఫ్‌‌‌‌ జలాల్లో ఆధిపత్యం కోసం ఢీ అంటే ఢీ అంటున్న ఇరాన్.. తన చర్యలతో మరోసారి ఉద్రిక్తతలు పెంచింది. ఫిషింగ్‌‌‌‌ షిప్‌‌‌‌ను ఢీకొట్టిందని, ఇంటర్నేషనల్ మెరైన్ రూల్స్ బ్రేక్ చేసిందంటూ బ్రిటిష్‌‌‌‌ జెండాతో ఉన్న ఆయిల్‌‌‌‌ ట్యాంకర్‌‌‌‌‌‌‌‌ను సీజ్ చేసి కయ్యానికి కాలుదువ్వింది. ఈ ట్యాంకర్‌‌‌‌లో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా.. వారిలో కెప్టెన్ సహా18 మంది ఇండియన్లు ఉన్నారు.

అసలేం జరిగిందంటే..

ఇరాన్ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్​జీసీ) ​స్వాధీనం చేసుకున్న ‘స్టెనా ఇంపెరా’ అనే ఆయిల్ ట్యాంకర్.. స్వీడన్‌‌‌‌ కంపెనీ స్టెనా బల్క్‌‌‌‌కు చెందినది. “హొర్ముజ్ స్ట్రెయిట్‌‌‌‌లోని అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న షిప్‌‌‌‌ను శుక్రవారం ఒక హెలికాఫ్టర్‌‌‌‌‌‌‌‌, నాలుగు నేవీ క్రాఫ్ట్​లు చుట్టుముట్టాయి. తర్వాత ఉన్నట్టుండి ఆయిల్‌‌‌‌ ట్యాంకర్‌‌‌‌‌‌‌‌ తన దిశ మార్చుకుంది. ఇరాన్‌‌‌‌ వైపు వెళ్లింది. షిప్‌‌‌‌కు పూర్తి నేవిగేషన్‌‌‌‌ వ్యవస్థ ఉంది. ఇంటర్నేషనల్‌‌‌‌ రూల్స్‌‌‌‌ను కూడా అది పాటించింది. కానీ సీజ్ చేశారు. ట్యాంకర్​లోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. షిప్పుతో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించాం.  కానీ సాధ్యపడలేదు. దీనిపై యూకే, స్వీడన్‌‌‌‌ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం” అని స్టెనా బల్క్‌‌‌‌ కంపెనీ ప్రెసిడెంట్‌‌‌‌ ఎరిక్‌‌‌‌ హానెల్‌‌‌‌ వివరించారు. ట్యాంకర్​లో ఇండియన్లతోపాటు రష్యా, ఫిలిపినో, లాట్వియా దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ మెరైన్ రూల్స్ ను ఉల్లంఘించినందుకే ట్యాంకర్​ను సీజ్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ ఫిషింగ్‌‌‌‌ షిప్‌‌‌‌ను  ట్యాంకర్ ఢీకొట్టిందని, తర్వాత తమ నేవీ క్రాఫ్ట్ చేసిన కాల్స్​కు స్పందించలేదని ఆరోపించింది. మరోవైపు బ్రిటన్​కు చెందిన, లైబీరియా జెండాతో ఉన్న ‘ఎంవీ మెస్డార్’ అనే ట్యాంకర్​ను మాత్రం ఇరాన్ విడుదల చేసింది.

రియాక్షన్ తీవ్రంగా ఉంటుంది..: యూకే

‘‘ఇరాన్ చర్యలు ఆమోదనీయం కాదు. మేం తీవ్ర ఆందోళన తెలుపుతున్నాం. ఇది ఇంటర్నేషనల్ ఫ్రీడమ్​ఆఫ్ నావిగేషన్​ను చాలెంజ్ చేయడమే. వివాదాన్ని త్వరగా పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని యూకే ఫారిన్ సెక్రెటరీ జెరెమీ హంట్ హెచ్చరించారు. ‘‘ఫ్రీడమ్​ఆఫ్ నావిగేషన్​ను ఇరాన్ కచ్చితంగా కొనసాగించాలి. మేం మిలటరీ యాక్షన్ చేపట్టాలని అనుకోవడం లేదు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నాం” అని స్పష్టం చేశారు. బ్రిటిష్​షిప్పులు కొన్నాళ్లపాటు హొర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లొద్దని సూచించారు.

బ్రిటన్​పై ఇరాన్ ప్రతీకారం!

ఇదే నెలలోనే ఇరాన్​కు చెందిన ఆయిల్ ట్యాంకర్ ‘గ్రేస్‌‌‌‌–1’ను బ్రిటిష్ మెరైన్స్ స్వాధీనం చేసుకున్నాయి. యూరోపియన్ యూనియన్ ఆదేశాలకు విరుద్ధంగా సిరియాకు ఆయిల్ సరఫరా చేస్తోందన్న కారణంతో ట్యాంకర్​ను సీజ్ చేశాయి. అందులో ఉన్న నలుగురు ఇండియన్ల (సిబ్బంది)ను అదుపులోకి తీసుకున్నాయి. దీంతో బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌‌‌‌ను తమ అదుపులోకి తీసుకునేందుకు ఇరాన్ అప్పట్లోనే ప్రయత్నించింది. ఆయిల్​ను సిరియాకు సరఫరా చేయబోమని మాటిస్తే ట్యాంకర్‌‌‌‌ను ఇరాన్‌‌‌‌కు అప్పగిస్తామని బ్రిటన్ చెప్పింది. ఇండియన్ సిబ్బందికి బెయిల్ ఇచ్చినా, ట్యాంకర్​ను విడుదల చేయలేదు. ఈ క్రమంలో బ్రిటన్ చర్యలకు ప్రతీకారంగా షిప్పును ఇరాన్ సీజ్ చేసింది.రెండు వారాల కిందట తమ సూపర్ ట్యాంకర్​ను బ్రిటన్ స్వాధీనం చేసుకున్నందుకు ప్రతి చర్యగానే బ్రిటిష్ ట్యాంకర్​ను స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేసింది.