వచ్చే ఏడాది నుంచి కాలేజీల్లో కొత్త ఫీజులు

వచ్చే ఏడాది నుంచి కాలేజీల్లో కొత్త ఫీజులు
  • వచ్చే ఏడాది నుంచి కాలేజీల్లో కొత్త ఫీజులు
  • ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులకు పెంపు
  • నోటిఫికేషన్ ఇచ్చిన ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ
  • రెండేండ్ల ఆమ్దానీ, ఖర్చుల లెక్కలు ఇయ్యాలని మేనేజ్​మెంట్లకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే అకాడమిక్ ఇయర్ (2022–23) ​ నుంచి ప్రైవేటు ప్రొఫెషనల్, టెక్నికల్ కాలేజీల్లో కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) నోటిఫికేషన్​ రిలీజ్ చేసింది. 2022–23 అకాడమిక్ ఇయర్​నుంచి 2024–25 దాకా అన్ని ప్రైవేటు కాలేజీల్లోని పలు కోర్సులకు కొత్త ఫీజులను నిర్ణయించనున్నట్టు వెల్లడించింది. మూడేండ్ల కింద నిర్ణయించిన ఫీజులు ఈ అకాడమిక్ ఇయర్​2021–22తో ముగియనున్నాయి. దీంతో తాజాగా టీఏఎఫ్ఆర్సీ మెంబర్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఫీజుల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 28లోగా కాలేజీల మేనేజ్మెంట్లు 2019–-20 ఆడిట్ రిపోర్టు, 2019–20,2020–21 ఆదాయ,వ్యయాల లెక్కలను ఇవ్వాలని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పేర్లు, పాన్, ఆధార్ వివరాలు సమర్పించాలని టీఏఎఫ్ఆర్సీ పేర్కొన్నది. కాగా, కాలేజీల డెవలప్​మెంట్ కు15% కంటే ఎక్కువ లాభం పొందవద్దనే నిబంధన ఉంది.

పెరుగనున్నది ఈ కోర్సుల్లోనే..
బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, బీ.ఆర్క్​, ఎం.ఆర్క్​, బీ.ప్లానింగ్, ఎం.ప్లానింగ్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా–డీ, ఎంబీఏ,ఎంసీఏ, ఎల్​ఎల్​బీ/బీఎల్​, ఎల్ ఎల్ఎం/ఎంఎల్, బీఈడీ, ఎంఈడీ, డీపీఈడీ, యూజీ డీపీఈడీతో పాటు ఇతర కోర్సుల ఫీజులను నిర్ణయిస్తారు. 2019–22 అకాడమిక్ ఇయర్​బ్లాక్ పీరియడ్​లో సగటున 20% ఫీజు పెరిగింది. అయితే, ఫీజుల పెంపునకు 2019-–20 లెక్కలనే పరిగణలోకి తీసుకుంటామని టీఏఎఫ్ఆర్సీ ప్రకటించింది. ఇప్పటివరకు ఇంజనీరింగ్​లో కనీస ఫీజు రూ.35 వేలు ఉండగా, ఎక్కువగా రూ.1.34 లక్షలు ఉంది.