కొత్త ప్రభుత్వ పాలన ప్రజాపక్షం కావాలి

కొత్త ప్రభుత్వ పాలన ప్రజాపక్షం కావాలి

తెలంగాణ అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు 2023 నవంబర్ 30న జరిగాయి. 2014లో రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గత రెండు ఎన్నికలలో  గెలిచిన బీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిరంకుశంగా పాలించింది. ఈ నేపథ్యంలో ప్రజలు మార్పును కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత, ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో  అమలు చేయాల్సిన బాధ్యత  కాంగ్రెస్​ప్రభుత్వానికి ఉంది. హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఎవరిని ఉద్దేశించి ప్రకటించారో, వారికి మాత్రమే లబ్ధి జరిగేలా సరైన మార్గదర్శకాలు రూపొందించుకోవాలి.

పథకాల ప్రయోజనాలు పొందడానికి అవసరమైన ప్రభుత్వ పత్రాలు (రేషన్ కార్డు లాంటివి ) ఇతర గుర్తింపు కార్డులను, అవినీతికి తావు లేకుండా అర్హులకు అందించడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలి. ప్రతి పథకం అమలుకు అవసరమైన నిధులను వార్షిక  బడ్జెట్లో పూర్తిస్థాయిలో కేటాయించుకోవాలి. పథకం అమలుకు  అవసరమైన నిధుల సమీకరణకు సరైన ప్రణాళిక కూడా ఉండాలి. ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా ఉన్నప్పుడే బడ్జెట్ కేటాయింపులు కూడా సవ్యంగా ఉంటాయి. ప్రజలకు తక్షణమే మేలు చేసే పథకాల అమలుకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలి.

ప్రణాళికాబద్ధంగా నిధుల బదిలీ

పథకాలను వివిధ కార్పొరేషన్ ల ఆధ్వర్యంలో నిర్వహించేటప్పుడు, ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆయా కార్పొరేషన్లకు సకాలంలో నిధులు బదిలీ  చేయడానికి తగిన ప్రణాళిక ఉండాలి.  ప్రతి పథకం అమలు తీరును చట్టబద్ధంగా సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) పరిధిలోకి తీసుకురావాలి. పథకం జీవోలను, మార్గదర్శకాలను, సర్క్యులర్లను, లబ్ధిదారుల వివరాలను ప్రతి సంవత్సరం పబ్లిక్ డొమైన్ లో ( ఆయా శాఖల వెబ్ సైట్స్, తెలుగు, ఉర్దూ భాషలలో వార్షిక నివేదికలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు కార్యాలయాల నోటీస్ బోర్డులపై ప్రదర్శన) ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచాలి.  

ప్రజల పౌర, ప్రజాస్వామిక హక్కులను కాపాడడానికి ఆచరణలో తగిన చర్యలు వేగంగా తీసుకోవాలి.  ప్రజలకు ప్రవేశంలేని ప్రగతి భవన్ చుట్టూ కంచెలను కూలగొట్టి,  జ్యోతిబా ఫులే ప్రజా భవన్ గా మార్చింది రేవంత్​ సర్కారు.  ప్రజలకు ప్రవేశం కల్పించి ప్రజా దర్బార్ లో పాల్గొనే అవకాశం కల్పించారు.  ఇది అందరూ స్వాగతించాల్సిన చర్య. ప్రజలు దరఖాస్తులతో వచ్చి  సంబంధిత అధికారికి తమ సమస్యను నివేదించేటప్పుడు వారికి కూర్చుని మాట్లాడే అవకాశం కల్పించాలి. వృద్ధులకు, వికలాంగులకు ఇది సౌకర్యంగా ఉంటుంది. 

ప్రజాఫిర్యాదులకు పోర్టల్​ 

పౌర సేవల చట్టాన్ని తీసుకువచ్చి, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం ఒక సమగ్రమైన పోర్టల్ ను ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పారదర్శకంగా పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. దీనిని రాబోయే అసెంబ్లీ సమావేశాలలోనే ఆమోదించాలి . ఇప్పటికే అటువంటి చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు ఆమోదించి అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుభవాలను కూడా గమనించి, తగిన మార్పులతో తెలంగాణ పౌర సేవల చట్టాన్ని తీసుకు రావాలి. రాష్ట్ర సచివాలయంలోకి ప్రజల ప్రవేశానికి అవకాశం కల్పించడం కూడా మంచి చర్య.  

సచివాలయం పైరవీకారుల అడ్డాగా మారకూడదు. మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి.  ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రకటించినట్లు.. పాలకులలా కాకుండా ప్రజలకు సేవకులుగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది వ్యవహరించాలి.  ప్రజా ఫిర్యాదుల కోసం, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. దానిని వెంటనే అమలులోకి తేవాలి. 

ధర్నాచౌక్​లో సదుపాయాలు కల్పించాలి

 రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీలకు  వ్యతిరేకంగా పోరాడుతున్న చిత్తనూర్ ప్రజలపై గత ప్రభుత్వం, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ప్రజలపై ఈ ప్రభుత్వం  బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. హైకోర్టు ఆదేశాల మేరకు, ఎటువంటి  పోలీసు అనుమతి లేకుండా, కేవలం సమాచారంతో,  ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ప్రజా నిరసనకు, భావాల వ్యక్తీకరణకు అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. 

నియోజకవర్గస్థాయి ప్రజాదర్బార్​

తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో సచివాలయం ఏర్పాటు చేస్తే  ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది . ఎక్కువ సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కారం అవుతాయి. అన్నిప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వాలంటరీ వ్యవస్థ  అర్హతలను నిర్దిష్టంగా నిర్ణయించి వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలి. ఎంపికైనవారికి గౌరవ భృతిలా కాకుండా రాష్ట్ర కనీస వేతనాలను, సాంఘిక భధ్రతను  అందించాలి. వీరిని గ్రామ సచివాలయం పర్యవేక్షించాలి.

మండల రెవెన్యూ వ్యవస్థను మెరుగుపర్చడం ద్వారా తగిన సిబ్బంది, నిధులు, మార్గదర్శకాలు రూపొందించి ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించాలి. నియోజకవర్గ స్థాయి ప్రజాదర్బార్ లు కూడా చాలా అవసరం. వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో నిర్వహించాలి. వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం అన్నిటికంటే ముఖ్యం. లేకుంటే ప్రజలు మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతారు.

- కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక