కేసీఆర్ మద్దతుతోనే.. కేంద్రంలో కొత్త సర్కారు ఏర్పడుతది : మంత్రి హరీశ్​ రావు

కేసీఆర్ మద్దతుతోనే..  కేంద్రంలో కొత్త సర్కారు ఏర్పడుతది  :  మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు : ఢిల్లీలో  బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి  కేసీఆర్ మద్దతుతో కొత్త  ప్రభుత్వం రాబోతున్నదని మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని మెట్రోగార్డెన్​లో అంగన్ వాడీల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన1.10 లక్షల  కోట్లు కేంద్రం నిలిపివేసిందని , బోరు మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టకుంటే రూ.21 వేల కోట్లు నిధులు నిలిపివేయడం దారుణమన్నారు. 

రాష్ట్రంలో  రూ.25 వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం కింద ప్రభుత్వం నల్లా నీళ్లు ఇస్తే.. హర్ ఘర్ కో జల్ పేరిట కేంద్రం కాపీ కొట్టి  దేశం మొత్తం ఇంటింటికీ నీళ్లిస్తామని చెబుతోందని ఎద్దేవా చేశారు. - వెనుక బడిన జిల్లాలకు రావాల్సిన రూ.1800 కోట్లు ఆపేశారన్నారు. దేశం మొత్తం తెలంగాణ తరహా రైతుబంధు, రైతుబీమా కావాలని అడుగుతున్నారన్నారు. 

అంగన్ వాడీలు అడిగిన  కోరికలు గొంతెమ్మ కోరికలు కావని,  రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు వేతనాల పెంపు అంశాలను  ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హరీశ్​హామీ ఇచ్చారు. ‘మీరంతా మా కుటుంబ సభ్యులు.. ఇది మీ ప్రభుత్వం.. మమ్మల్ని దీవిస్తే  కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని అన్నారు.