- ప్యాకేజ్డ్ ఫుడ్‌కు గుడ్ బై..
- మిల్లెట్స్, ఆర్గానిక్ఫుడ్స్కు వెల్కమ్
- ఆయుర్వేదం, యోగా, స్లీప్ మేనేజ్‌మెంట్‌కు ప్రయారిటీ
- టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా
- హెర్బల్ జ్యూస్‌లు, గ్రీన్ టీ, వెల్‌నెస్ షాట్స్
- మానసిక ఒత్తిడి, యాంగ్జైటీని తగ్గించుకోవడానికి డిజిటల్ డిటాక్స్
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు 40 ఏండ్లు దాటాయంటే జీవితం సెకండ్ ఇన్నింగ్స్‌లోకి ప్రవేశించినట్టు లెక్క. కానీ నేటి ఉరుకులు పరుగుల జీవితంలో, కలుషిత ఆహారం, మెంటల్ స్ట్రెస్ వల్ల 40 ఏండ్లకే 60 ఏండ్ల వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి చారలు, మోకాళ్ల నొప్పులు, కొద్దిపాటి పనికే ఆయాసం రావడంలాంటి లక్షణాలు కలవరపెడుతున్నాయి.
అయితే, దీనికి ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు, సెలూన్ ట్రీట్‌మెంట్ల కంటే కిచెన్ రూమ్‌ను మార్చుకోవడమే అసలైన సొల్యూషన్ అని నేటి 40+ గ్రూప్ గుర్తిస్తున్నది. ఈ అవగాహన నుంచి పుట్టుకొచ్చిందే కిచెన్ రీసెట్ ఎరా. కేవలం తిండిని మార్చడమే కాకుండా, శరీరంలోని కణాల క్షీణతను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేసే ‘స్లో ఏజింగ్’ మంత్రం ఇప్పుడు ఒక హెల్త్ ట్రెండ్‌లా మారుతున్నది.
కిచెన్ రీసెట్ అంటే.. వంటగదిలో వస్తువులను మార్చడం మాత్రమే కాదు.. ఫుడ్ మెనూను కూడా మారుస్తున్నారు ఈ 40+ గ్రూప్. ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల బాడీ త్వరగా ముసలితనానికి చేరుకుంటుందని అర్థం చేసుకున్న నడివయస్కులు..తమ కిచెన్లను మిల్లెట్స్, ఆర్గానిక్ ఫుడ్స్‌తో నింపుతున్నారు.
కిచెన్ రాక్స్ నిండా కనిపించే మైదా పిండి, రిఫైన్డ్ ఆయిల్స్, షుగర్స్, నూడిల్స్‌ను చెత్తబుట్టలో వేసి, వాటి స్థానంలో గానుగ నూనెలు, రాతి ఉప్పు, తాటి బెల్లం తదితరాలను సర్దుతున్నారు. అలాగే, పదార్థాలను స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలను పక్కనబెట్టి మట్టి పాత్రలు, గాజు సీసాలు, రాగి గ్లాసులను వాడుతున్నారు. ఈ కిచెన్ రీసెట్ ట్రెండ్‌తో మన పూర్వీకుల కల్చర్‌ను మళ్లీ లైమ్ లైట్‌లోకి తీసుకొస్తున్నారు.
ప్లేట్ నిండా పాతతరం ఆహారం..
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏదైనా నాలుకకు రుచిగా లేకుంటే పక్కన పెట్టే ఈ నడి ఏజ్ గ్రూప్ బ్యాచ్.. ఇప్పుడు సప్పగున్నా, ఉప్పగున్నా లాగించేస్తున్నారు. ఒకప్పుడు పాత తరం వారే ఎక్కువగా ఇష్టపడే రాగులు, సజ్జలు, కొర్రలు ఇప్పుడు 40+ ఏజ్ గ్రూప్ ప్లేట్లలో మెయిన్ మెనూగా చేరింది. వైట్ రైస్, చపాతీలు తింటే వచ్చే గ్లూటెన్ సమస్యలు, రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడంలాంటి ముప్పు పొంచి ఉంటుంది.
అందుకే వీటికి బదులుగా.. రాగి ముద్దలు, జొన్న రొట్టెలు బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. వీటిలో ఉండే పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. వృద్ధాప్య ఛాయలను నెమ్మదింపజేస్తాయి. ఉదయాన్నే వేడి రాగి జావా తాగడం, మధ్యాహ్నం కొర్రల అన్నం తింటున్నారు.
చద్దన్నమే సూపర్ ఫుడ్..
పేగు ఆరోగ్యంగా ఉంటేనే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే గట్ హెల్త్ కోసం సంప్రదాయ ప్రోబయోటిక్స్ వైపు మళ్లారు. రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసి, మరుసటి రోజు ఉదయం ఉల్లిపాయతో కలిపి తినే చద్దన్నాన్ని సూపర్ ఫుడ్‌గా తీసుకుంటున్నారు. పులియబెట్టిన రాగి అంబలిలాంటి పానీయాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి.
మాంసాహారం వల్ల కలిగే హెవీనెస్ నుంచి తప్పించుకోవడానికి ప్లాంట్ బేస్డ్ డైట్, పప్పుధాన్యాలు, సోయా ఉత్పత్తులకు ప్రయారిటీ ఇస్తున్నరు. కాఫీ, టీలలో ఉండే కెఫీన్ వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుందని భావిస్తున్న 40+ బ్యాచ్.. బదులుగా ఉసిరి, పసుపు, అల్లం కలిపిన వెల్‌నెస్ షాట్స్, హెర్బల్ గ్రీన్ టీ తీసుకుంటున్నారు.
స్ట్రెస్‌కు డిటాక్స్‌తో చెక్
ఈ 40+ బ్యాచ్ హెల్తీ లైఫ్ స్టైల్‌కు ఆయుర్వేదం, ఆధునిక సైన్స్ కూడా తోడయ్యాయి. వయసు ప్రభావం శరీరంపై పడకుండా ఉండేందుకు.. రాత్రి పూట త్రిఫల చూర్ణం తీసుకోవడంతోపాటు ఉదయాన్నే డిటాక్స్ వాటర్ తాగుతున్నారు. వీటికి తోడు స్లీప్ సైకిల్ మేనేజ్‌మెంట్‌కూ ప్రయారిటీ ఇస్తున్నారు.
రాత్రి 10 గంటల కల్లా ఫోన్లను పక్కనబెట్టి డిజిటల్ డిటాక్స్ పాటిస్తూ, కనీసం 7 నుంచి 8 గంటలు హాయిగా పడుకుంటున్నారు. కంటినిండా నిద్రవల్ల బాడీలోని కణాలు రిపేర్ అయ్యి, ముఖంలో తాజాదనం కనిపిస్తుంది. నిత్యం యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, కణాల వృద్ధాప్య రేటు మందగిస్తున్నది. మొత్తానికి ఈ కిచెన్ రీసెట్ ప్రయాణం.. కొత్త ట్రెండ్‌గా మారింది.
