- తీసుకొచ్చే యోచనలో రాష్ట్ర సర్కార్
- చట్టంలోని అంశాలను పరిశీలించాలని
- పోలీసు శాఖకు ఆదేశాలు
- సీపీ సజ్జనార్ నేతృత్వంలోనిసిట్తో కేసుల దర్యాప్తు
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా చానెల్స్‌లో వస్తున్న ద్వేషపూరిత ప్రసంగాలు, ఫేక్ న్యూస్ కట్టడిపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వంలో ఉండే కీలక వ్యక్తులు, అధికారులే లక్ష్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. వీటిని చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కర్నాటక సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన ‘ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల (నివారణ) బిల్లు–2025’ తరహాలో ప్రత్యేక చట్టం తీసుకురావాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ చట్టంలోని అంశాలను పరిశీలించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల మహిళా ఐఏఎస్ అధికారిణిపై ఓ చానెల్ న్యూస్ ప్రసారం చేసింది. సీఎం రేవంత్ ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేసిన వ్యవహారంపై నారాయణపేట్ జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ రెండు వేర్వేరు ఘటనల దర్యాప్తును సిట్‌కు అప్పగిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తరహా ఫేక్, ద్వేష పూరిత ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నదో ఈ సిట్ ఏర్పాటుతో స్పష్టం అవుతున్నది.
ఫేక్ న్యూస్‌పై సీఎం రేవంత్ సీరియస్
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులు ఏమైనా నమోదయ్యాయా? అని సిట్ బృందం పరిశీలిస్తున్నది. నిరాధార ఆరోపణలు చేయడానికి కారణాలు ఏంటి? తెరవెనుక ఉన్నది ఎవరు? ఎందుకు ఈ తరహాలో ఫేక్ ప్రచారాలు చేయిస్తున్నారో నిగ్గు తేల్చేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటైంది. ఈ బృందం గుర్తించే అంశాల ఆధారంగా కర్నాటక తరహాలో చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మహిళా ఐఏఎస్‌పై న్యూస్ టెలికాస్ట్, సీఎం ఫొటోల మార్ఫింగ్ అంశాలను రేవంత్ రెడ్డి సీరియస్ తీసుకున్నారు. ఈ రెండు అంశాలపై మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది. ఆధారాల్లేకుండా ఇష్టమొచ్చినట్లు వార్తలు ప్రసారం చేస్తే కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
కఠిన శిక్షలు
- ద్వేషపూరిత కంటెంట్ పోస్టు చేసినా, టెలికాస్ట్ చేసినా కనీసం ఏడాది నుంచి ఏడేండ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారు.
- జైలు నుంచి బయటికొచ్చి మళ్లీ అదే నేరం చేస్తే కనీసం రెండేండ్ల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుంది.
- బాధితులకు జరిగిన డ్యామేజీని బట్టి కోర్టు తగిన పరిహారం చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేస్తుంది.
