దేశ విభజనకు కారణం ఆ మూడు శక్తులే.. రాజకీయ దుమారం రేపుతున్న NCERT సిలబస్ !

దేశ విభజనకు కారణం ఆ మూడు శక్తులే.. రాజకీయ దుమారం రేపుతున్న NCERT సిలబస్ !

భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో దేశ విభజన కీలక ఘట్టం. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా.. ఎందరో మహానుభావుల త్యాగాల పునాదులపై స్వాతంత్ర్యం సిద్ధించింది.  కానీ ఆ వెంటనే వేర్పాటు వాద శక్తులు దేశం రెండు ముక్కలు కావాల్సిందేనని పట్టుబట్టాయి. అందుకోసం హింసాత్మక మార్గాన్ని ఎంచుకున్నారు. చివరికి భారత్-పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విడిపోయింది బ్రిటిష్ ఇండియా. అయితే దీనిపై ఈ మధ్య కాలంలో చర్చోపచర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా NCERT 6 - 12 తరగతుల మధ్య దేశ విభజనపై రూపొందించిన పాఠ్యాంశాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దేశ విభజనకు ఆ మూడు శక్తులే కారణం అంటూ కొత్త మాడ్యూల్స్ లో పేర్కొనటం తీవ్ర వివాదాస్పదం అవుతోంది.  

దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవం ఆగస్టు 14 సందర్భంగా NCERT స్కూల్ బుక్స్ లో స్పెషల్ మాడ్యూల్స్ ను విడుదల చేసింది. ఈ మాడ్యూల్స్ లో దేశ విభజనకు కేవలం ఒకరి వలన జరిగింది కాదనీ.. మూడు శక్తులు దీని వెనుక ఉన్నాయని పేర్కొంది. మహ్మద్ అలీ జిన్నా విభజన కోసం జనాలను రెచ్చగొట్టగా.. కాంగ్రెస్ విభజనకు ఆమోదం తెలిపింది.. మౌంట్ బాటెన్ విభజన చేశాడని పేర్కొంది.  

దీనితో పాటు విభజన కారణంగా కశ్మీర్ కు భద్రతా సమస్యలు కూడా పుట్టుకొచ్చాయని పేర్కొంది. అప్పటి నుంచి పొరుగు దేశమైన పాక్ కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకుని భారత్ పై ఒత్తిడి చేయాలని చూస్తోందని రాసుకొచ్చింది. అయితే రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ కాకుండా 6-8 వరకు ఒక వర్షన్, 9-12 తరగతులకు ఒక వర్షన్ లెక్కన సపరేట్ వర్షన్ లో తీసుకొచ్చింది. 

దేశ విభజనకై జిన్నా డిమాండ్:

 దేశ విభజనకై ముస్లిం లీగ్ అధ్యక్షుడు జిన్నా అప్పట్లో గట్టిగా పట్టుబట్టాడు. దీనికి సంబంధించిన 1940 నాటి లాహోర్ రిజొల్యుషన్ ను లేటెస్ట్ మాడ్యూల్స్ లో పేర్కొందిNCERT . హిందూ ముస్లింలు రెండు వేర్వేరు గ్రామాలకు చెందిన వారని.. వేర్వేరు ఫిలాసఫీ, సంస్కృతి, సాహిత్యానికి సంబంధించిన వారని అప్పట్లో జిన్నా ప్రతిపాదించాడు. అయితే అప్పట్లో బ్రిటిష్ డొమినియన్ స్టేటస్ లో ఇండియాను యూనిటీగా ఉంచాలని చూసిందని.. కానీ ఆ ప్రపోజల్ ను కాంగ్రెస్ తిరస్కరించిందని లేటెస్ట్ సిలబస్ లో పొందుపర్చారు. డొమినియన్ స్టేటస్ అంటే.. సగం స్వాతంత్ర్యం ఇచ్చి.. సగం అధికారాలు బ్రిటిష్ చేతిలో ఉంచడం. 

విభజనపై గాంధీ, నెహ్రూ, పటేల్ వైఖరి ఏంటి..?:

దేశ విభజనపై కీలక నేతలైన గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వైఖరి గురించి కూడా పేర్కొంది. ఇండియా యుద్ధ రంగంగా మారింది. దేశంలో సివిల్ వార్ ఎదుర్కునే కంటే దేశాన్ని విభజించడమే మంచిదని పటేల్ అభిప్రాయ పడినట్లు మాడ్యూల్ పొందుపర్చారు. 

►ALSO READ | Mumbai Rains: ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..విక్రోలీలో విరిగిపడ్డ కొండచరియలు

అయితే గాంధీ దేశ విభజనకు ఒప్పుకోలేదు. అలాగని హింసాత్మక విభజనకు కూడా అంగీకరించలేదు. అలాగే దేశ విభజనకు కాంగ్రెస్ మద్ధతు ఇవ్వడాన్ని కూడా ఆపలేకపోయారని కొత్త లెసన్స్ లో రాశారు. ఆ తర్వాత నెహ్రూ, పటేల్ విభజనకు అంగీకరించారు. 1947 జూన్ 14న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చివరికి గాంధీ కూడా అంగీకరించారని పేర్కొంది. 

మౌంట్ బాటెన్ చేసిన ద్రోహం:

ఈ మాడ్యూల్స్ లో దేశ విభజనకు.. అనిశ్చితికి కారణం మౌంట్ బాటెన్ గా పేర్కొన్నారు. 1947 జూన్ లోనే అధికారాల మార్పిడికి అంగీకరించిన లార్డ్ మౌంట్ బాటెన్ ఆ తర్వాత ఆగస్టు 15కు వాయిదా వేశారని పేర్కొంది. దీంతో బౌండరీలను నిర్ణయించడంలో సందిగ్ధత ఏర్పడిందని.. ఆగస్టు 15 రోజు వరకు కూడా తాము ఇండియాలో ఉన్నామో.. లేక పాకిస్తాన్ లో ఉన్నామో అన్న క్లారిటీ లేకుండిందని మాడ్యూల్ పేర్కొంది. భయంకర అల్లర్లకు ఇది ఒక కారణం అయ్యిందని లెసన్ లో రాసుకొచ్చారు. 

హిందూ మహాసభ, ముస్లిం లీగ్ కారణంగానే విభజన: మండిపడ్డ కాంగ్రెస్

ఎన్సీఈఆర్టీ రూపొందిచిన మాడ్యూల్స్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నా్యి. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ మాడ్యుల్ నిజాన్ని దాచి అబద్ధాలను ప్రచారం చేసేందుకు తీసుకొచ్చారని.. అలాంటి మాడ్యూల్స్ ను వెంటనే కాల్చిపారేయాలని కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ పవన్ ఖేరా మండిపడ్డారు. దేశ విభజన అనేది హిందూ మహాసభ, ముస్లిం లీగ్ మధ్య ఉన్న ఒప్పందం కారణంగా.. వాళ్ల స్వలాభం కోసం చేసిన కుట్రల వలన జరిగిందని అన్నారు. 

దేశానికి ఆర్ఎస్ఎస్ చాలా ప్రమాదకరం.. దేశ విభజనకు హిందూ మహాసభ 1938లో మొదట  కుట్ర చేసి ప్రాపగాండ నడిపిందని పేర్కొన్నారు. దీన్ని 1940 లో జిన్నా రిపీట్ చేశారని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు.