40 లక్షలకో లిక్కర్‌ షాపు

40 లక్షలకో లిక్కర్‌ షాపు
  • ఎంత ఇచ్చి తీసుకోవడానికైనా రెడీగా పాత వాళ్లు
  • అంత పెడితే గిట్టుబాటెట్లయితదని అనుమానాలు
  • కల్తీ మద్యం, మందు ఎక్కువ ధరకు అమ్మడానికే?

హైదరాబాద్‌, వెలుగురాష్ట్రంలో మద్యం షాపులు మస్తు డిమాండ్‌ పలుకుతున్నయ్‌. లక్కీ డ్రాలో దుకాణం లైసెన్స్‌ పొందిన వాళ్ల దగ్గర్నుంచి పాత వ్యాపారులు ఎంత పెట్టయినా తీసుకునేందుకు వెనుకాడట్లేదు. రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షలు పెట్టడానికీ ముందుకొస్తున్నరు.  లైసెన్స్‌ కోసం కట్టిన ఫీజులు, డీడీల డబ్బు కూడా సపరేట్‌గా ఇస్తున్నట్టు తెలుస్తోంది.

జిల్లాకు 5 నుంచి 10 షాపులు

సెప్టెంబర్‌ 30తో మద్యం పాలసీ గడువు ముగిసింది. కానీ ప్రభుత్వం అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించింది. రాష్ట్రంలోని 2,216 దుకాణాలకు 48,784 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్లతో 975.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్కో దుకాణానికి సగటున 22 దరఖాస్తులొచ్చాయి. దుకాణాలు దక్కించుకోవడానికి పాత, కొత్త వ్యాపారలు బాగా ప్రయత్నించారు. ఏపీలో మద్యం బంద్‌తో అక్కడి నుంచీ బాగానే వచ్చారు. దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలు పెట్టినా ఒక్కొక్కరు 5 నుంచి 10 అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయినా కొందరికి అదృష్టం దక్కలేదు. కొత్తగా దక్కించుకున్న వాళ్లలో కొందరు దుకాణాల నిర్వహణకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో పాత వాళ్లు మళ్లీ రంగంలోకి దిగారు. వారి నుంచి దుకాణాలు కొంటున్నారు. ఏరియాను బట్టి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు సమాచారం. ఇలా ఒక్కో జిల్లాలో 5 నుంచి 10 షాపుల వరకు తీసుకున్నట్లు తెలిసింది.

ఎట్ల గిట్టుబాటైతది?

ఒక్కో దుకాణానికి రూ. 40 లక్షల వరకు ఇస్తుండటంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులిస్తే ఎట్ల గిట్టుబాటవుతుందని ఆలోచిస్తున్నరు. రూ. 30 లక్షలను రూపాయి వడ్డీకి ఇచ్చినా నెలకు రూ. 30 వేలు వస్తయని, అట్లాంటిది ఇంత ఖర్చు పెట్టి దుకాణాలు ఎందుకు తీసుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు. కల్తీ మద్యం అమ్మి, ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్మి ఆదాయం పొందుతారని పలువురు అంటున్నారు.