సమస్యలు తీరుస్తాం.. అభివృద్ధి చేసి తీరుతాం

సమస్యలు తీరుస్తాం..  అభివృద్ధి చేసి తీరుతాం
  • నేడు పంచాయతీల్లో కొలువుదీరనున్న కొత్త పాలక వర్గాలు
  • బాధ్యతలు చేపట్టనున్న సర్పంచ్​లు
  • నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ధీమా

మంచిర్యాల, వెలుగు: దాదాపు రెండు సంవత్సరాల తర్వాత గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,514 పంచాయతీలకు గాను 1,505 జీపీలకు ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్​లు, ఉప సర్పంచ్​లు, వార్డు మెంబర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో పంచాయతీ ఆఫీస్​లను క్లీన్ చేసి, రంగులు వేసి ముస్తాబు చేశారు.

 గత రెండు సంవత్సరాలుగా పాలకవర్గాలు లేకపోవడం, ప్రత్యేక అధికారుల పాలన నామమాత్రంగా సాగడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఎట్టకేలకు రెండేండ్ల తర్వాత గ్రామపంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టడంతో ప్రజలు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమయ్యారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్​లు అనేక హామీలు ఇవ్వడంతో పాటు అభివృద్ధి పనులు చేపడుతామని వాగ్దానం చేశారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్​లు, ఉపసర్పంచ్ లు, వార్డు మెంబర్లు సమన్వయంతో పనిచేస్తూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు యువ సర్పంచ్​లను పలకరించగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, గ్రామాల్లో అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు.  వివరాలు వారి మాటల్లోనే..

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు మెరుగైన సేవలందిస్తా. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వాడకం నియంత్రణకు కృషి చేస్తా. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరుస్తా. వనమహోత్సవంలో భాగంగా నర్సరీలను బలోపేతం చేసి ప్రజల డిమాండ్ మేరకు సీడింగ్ చేపిస్తూ మొక్కల పెంపకంలో శ్రద్ధ చూపిస్తూ వాతావరణ సమతుల్యతకు కృషి చేస్తా. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో హనుమాన్ ఆలయం, పోచమ్మ గుడి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, గోదావరికి వెళ్లడానికి బీటి రోడ్డు నిర్మాణానికి కృషిచేస్తా. కోతుల బెడద నుంచి గ్రామ ప్రజలకు విముక్తి కల్పిస్తా. – లక్కాకుల వనిత సృజన్, కాసిపేట సర్పంచ్, దండేపల్లి మండలం

మంత్రి వివేక్ సహకారంతో గ్రామాభివృద్ధి 

మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఫండ్స్ శాంక్షన్ చేయించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతా. గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తా. మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో గ్రామానికి నిధులు శాంక్షన్ చేయించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతా. గ్రామంలోని యువతకు క్రికెట్ గ్రౌండ్, ఓపెన్ జిమ్​తో పాటు సర్కిల్ పాయింట్స్ వద్ద సోలార్ హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయిస్తా. శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తా. కామెర మనోహర్, మిట్టపల్లి సర్పంచ్, జైపూర్ మండలం

సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తా..

కోటపల్లి మండల కేంద్రంలో మెయిన్ రోడ్ విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తా. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తా.ప్రతివారం మండల కేంద్రంలోని హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. విద్యను మెరుగుపరచడంలో ముందుంటాను. గ్రామంలో తాగునీటి సమస్య, రోడ్లు, పారిశుధ్యం మెరుగుపర్చి గ్రామాన్ని మండలంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతా. లైబ్రరీలో సదుపాయాలు కల్పించి విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కృషి చేస్తా. గ్రామాభివృద్ధి కోసం మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో ఫండ్స్ తీసుకొస్తా. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామం మొత్తానికి సరిపడా కరెంట్ ఫ్రీగా అందిస్తా.- ఆలూరి సంపత్, కోటపల్లి సర్పంచ్, కోటపల్లి మండలం

ఇంటి పన్నులు నేనే చెల్లిస్తా.. 

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వచ్చే అయిదు సంవత్సరాలు ఇంటి పన్నులు నేనే భరిస్తా. ప్రజలు ఎవరు ఇంటి పన్నులు రేపటి నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు. గ్రామంలో ఎవరైనా చనిపోతే రూ.10 వేలు, ఆడపిల్ల పుట్టిన వారికి రూ.5 వేలు ఇస్తాం. గ్రామంలో తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో బోర్లకు మోటార్లు బిగించి నిరంతరం నీటి సరఫరా చేస్తాం. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణం చేపడతా. మిగిలిపోయిన అంతర్గత రహదారులను పూర్తిచేయిస్తా. అర్హులైన నిరుపేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తా. గ్రామంలో వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.–పి.శ్యామలత, మాలగురిజాల, బెల్లంపల్లి మండలం