మునుగోడు ఉప ఎన్నికతోనే కొత్త పింఛన్లు

మునుగోడు ఉప ఎన్నికతోనే కొత్త పింఛన్లు

టీఆర్ఎస్ లీడర్లు గుడిని, గుడిలో లింగాన్ని మింగే రకం 

యాదాద్రి/నార్కట్​పల్లి, వెలుగు: ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్ ను నిలదీయాలని ప్రజలకు బీజేపీ స్టేట్ చీఫ్ ​సంజయ్ పిలుపునిచ్చారు. ‘‘ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చిండు. డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రుణమాఫీ అన్నడు. ఇవన్నీ ఎందుకు అమలు చేయలేదు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను నిలదీయండి. ప్రగతి భవన్ బద్దలు కొట్టండి” అని అన్నారు. గడీలో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చేసి, పేదల రాజ్యం తేవాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు.  యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం రామన్నపేట మండలం పల్లివాడ, అమ్మనబోలులో నిర్వహించిన సభల్లో సంజయ్ మాట్లాడారు. టీఆర్ఎస్ లీడర్లు గుడిని, గుడిలో లింగాన్ని మింగుతారని విమర్శించారు. ‘‘యాదగిరిగుట్ట టెంపుల్​ను డెవలప్ చేస్తామని చెప్పి.. చుట్టు పక్కల భూములు మొత్తం కేసీఆర్​కుటుంబం కొనుగోలు చేసింది. నాసిరకంగా పనులు చేయడంతో ఆలయ గోడలు కూలిపోతున్నాయి. కేసీఆర్ పాపం పండగానే దేవుడు ఊరుకోడు” అని అన్నారు.

కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగమేందీ?

పేదోళ్లు బాగా చదివి ఐఏఎస్​, ఐపీఎస్ కాకూడదనే కేసీఆర్ కాలేజీలను డెవలప్ చేయడం లేదని సంజయ్ మండిపడ్డారు. పైగా గొర్లు, బర్లు కాసి బతకాలని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘రూ.100 కోట్లు ఇస్తే ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిసి కూడా ఇవ్వడం లేదు. ఆస్తులు లీజుకు ఇచ్చుకోవడానికే నార్కట్​పల్లి డిపోను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతచారి, పోలీసు కృష్ణయ్య, సుమన్, యాదగిరి వల్లనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కుటుంబం ఏ త్యాగం చేసింది” అని ప్రశ్నించారు. బీజేపీ చేసిన పోరాటాలు, మునుగోడు ఉప ఎన్నిక మూలంగానే కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారని, గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారని, నియోజకవర్గ సర్పంచుల ఖాతాల్లో రూ.20 లక్షల చొప్పున జమ చేస్తున్నారని చెప్పారు. అమ్మనబోలును మండలం చేయాలని ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామన్నారు. బీజేపీ పాదయాత్రతో ప్రభుత్వం కదులుతోందని ఆ పార్టీ స్టేట్​వైస్​ప్రెసిడెంట్ గంగిడి మనోహర్​రెడ్డి అన్నారు. 

21న సభ ఉంటది..  

ఈ నెల 21న మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ ఉంటుందని సంజయ్ స్పష్టం చేశారు. సభ వాయిదా పడిందంటూ ప్రచారం జరగడంతో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 

పాదయాత్రలో ​చుగ్, వివేక్ 

పాదయాత్ర రామన్నపేట మండలం పల్లివాడకు చేరుకోగానే బీజేపీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు వచ్చారు. సంజయ్​తో కలిసి పాదయాత్ర చేశారు. అనంతరం మునుగోడు ఉప ఎన్నిక సన్నాహక మీటింగ్​లో పాల్గొన్నారు.

మహిళలకు 4 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి

వడ్డీ రాయితీ లభిస్తుందన్న ఆశతో లోన్లు తీసుకున్న మహిళలు ప్రభుత్వ నిర్వాకం వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. సెర్ప్, మెప్మా, స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్లు పేరుకుపోయాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​కు శుక్రవారం ఆయన లేఖ రాశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా బకాయిలను విడుదల చేసి ఆడబిడ్డలను ఆదుకోవాలని సీఎంను ఆయన కోరారు. నిరుడు బడ్జెట్ లో వడ్డీ బకాయిలకు రూ.3 వేల కోట్లు కేటాయించినా విడుదల చేయలేదన్నారు. గత ఎనిమిదేండ్ల పాలనలో డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ ఏడాది బడ్జెట్ లో రూ.1250 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు విడుదల చేయలేదని తెలిపారు.  ప్రతి నెలా వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారుల నుంచి మహిళా సంఘాలపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. ప్రభుత్వం నుంచి వడ్డీ బకాయిలు ఆలస్యం అవుతుండడంతో లోన్లు తీసుకున్న మహిళా సంఘాల పేర్లు డిఫాల్టర్ల లిస్ట్ లో చేరుస్తున్నారని తెలిపారు. సెర్ప్​పరిధిలో 3,99,120, మెప్మా పరిధిలో 1,81,225, మహిళా సంఘాల్లో 43,29,058 మంది సభ్యులు ఉన్నారని తన లేఖలో సంజయ్​ గుర్తు చేశారు.