- సస్పెండ్ చేసిన కలెక్టర్
కందనూలు, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో చనిపోయిన రైతుకు చెందిన రైతుభరోసా నిధులు దుర్వినియోగమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన వీరయ్యకు 6.11 ఎకరాల భూమి ఉంది. ఆయన 2020లో చనిపోగా, వారసత్వ సమస్య పరిష్కారం కాక కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. విషయాన్ని గమనించిన అప్పటి ఏఈవో విష్ణువర్ధన్ ప్రభుత్వం వీరయ్యకు మంజూరు చేసిన రైతుబంధు డబ్బులను అక్రమంగా తన తల్లి బ్యాంక్ ఖాతాకు మళ్లించాడు.
2022 వానాకాలం నుంచి 2025 వానాకాలం వరకు మొత్తం రూ.1,94,525 రైతుబంధు డబ్బులు మళ్లించాడు. ఈ విషయంపై బాధిత కుటుంబ సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విష్ణువర్ధన్ నిధులు దుర్వినియోగం చేసినట్లు తేలడంతో సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తల్లి ఖాతాకు మళ్లించిన డబ్బులను ఆయన నుంచి రికవరీ చేశారు.

