ఊరును ఖాళీ చేయాలంటూ బెదిరింపులు

ఊరును ఖాళీ చేయాలంటూ  బెదిరింపులు

ఆదిలాబాద్/కీసర, వెలుగు: ఉన్న నాలుకకు మందేస్తే.. కొండ నాలుక ఊడినట్లు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తెచ్చిన ధరణి.. కొత్త సమస్యలకు కారణమవుతోంది. ఊర్లకు ఊర్లే తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ల ముందు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ మండలం సావర్గాం గ్రామం ఏర్పడి 26 ఏండ్లు అయింది. భూ రికార్డుల ప్రక్షాళనలో అధికారులు ఆ గ్రామ జాగను నివాస స్థలంగా మార్చలేదు. ధరణిలోనూ ‘వ్యవసాయ భూమి’ పేరుతో పాత పట్టాదారు పేరే వస్తోంది. దీంతో ధరణిలో తమ పేరే ఉందని పట్టాదారు ఆ ఊరునే ఖాళీ చేయాలంటున్నారు. సర్కారు నిర్లక్ష్యంతో తమ ఉనికికే ప్రమాదం వచ్చిందని, న్యాయం చేయాలని ఆ గ్రామ ప్రజలు కలెక్టరేట్​ ముందు ఆందోళనకు దిగారు. 

జరిగింది ఇదీ..

1996లో సావర్గాం తాండా శివారులో నేరడిగొండకు చెందిన రాజుభాయి పేరుతో ఉన్న 28/ఆ 1, 5/అ లో సర్వే నెంబర్లలో దాదాపు 40 కుటుంబాలు ఐదెకరాల భూమి కొనుగోలు చేశాయి. బాండ్ పేపర్​మీద రాయించుకొని కొందరు ఇండ్లు కట్టుకోగా, మరికొందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. అప్పటి నుంచి ఆ పల్లె అభివృద్ధి చెందుతూ ఇప్పుడు 200 కుటుంబాలయ్యాయి. తెలంగాణ వచ్చాక సావర్గాం గ్రామ పంచాయతీగా మారింది. కానీ ప్రధాన గ్రామం ఉన్న భూమి మొత్తం పట్టాదారు రాజుభాయి పేరుమీదే ఉండిపోయింది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా దాన్ని‘వ్యవసాయ భూమి’ నుంచి తొలగించి గ్రామకంఠంలో చేర్చాల్సిన అధికారులు ఆ పనిచేయలేదు. ధరణి పోర్టల్ లోనూ వ్యవసాయ భూమిగానే చేర్చడంతో రాజుభాయి పేరిట కొత్తపాస్ బుక్ వచ్చింది. ఊరి జాగాకు కూడా రైతుబంధు వస్తోంది. దీంతో ఏడాది నుంచి పట్టదారు కుటుంబ సభ్యులు ఊరును ఖాళీ చేయాలంటూ తమను బెదిరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. 

ఆదిలాబాద్​ కలెక్టరేట్ ముందు ఆందోళన..

గిరిజన, లంబాడీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సావర్గం గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ​ముందు ఆందోళనకు దిగారు. ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మహేందర్ జాదవ్, అడ్వొకేట్ బొల్లారం సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. అప్పట్లో ఆసాములపై నమ్మకంతో బాండ్ పేపర్ల మీద భూమి రాయించుకున్నామని, 26 ఏండ్ల తర్వాత పట్టాదారు కుటుంబ సభ్యులు ఏకంగా ఊరును ఖాళీచేయమనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇన్నేండ్లుగా ప్రజలు ట్యాక్స్ లు, కరెంట్ బిల్లులు కడుతుంటే.. ఇంకా ఆ పట్టాను రద్దు చేయకుండా రెవెన్యూ అధికారులు ధరణి లో చేర్చడం వల్లే ఈ సమస్య తలెత్తిందని విమర్శించారు. కలెక్టర్ స్పందించి పట్టా రద్దు చేసి గ్రామాన్ని కాపాడాలని కోరారు. పూర్తి సర్వే చేయించి, న్యాయం చేస్తామని ఆర్డీవో రమేశ్ రాథోడ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మేడ్చల్​ కలెక్టరేట్​ వద్ద బొమ్మరాసిపేట రైతులు

ధరణితో కొత్త సమస్యలొచ్చాయని, సర్వే నెంబర్లు కనిపించకపోవడంతో తమ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం బొమ్మరాసిపేట గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మరాసిపేటలోని సర్వే నంబర్లు 323 నుంచి 409 వరకు దాదాపు 500 ఎకరాల భూమిని 40 ఏండ్ల కింద నల్గొండ జిల్లాకు చెందిన దుగ్గిరాల అనే ఇంటి పేరున్న వ్యక్తుల నుంచి గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు కొనుగోలు చేశారు. కొన్నేండ్ల నుంచి ఆ భూములను సాగుచేసుకుంటున్నారు. వాటికి పాస్ బుక్​లు కూడా వచ్చాయి. ధరణి పోర్టల్ లో ఆయా భూముల సర్వే నంబర్లు కనిపించ లేదు. కోర్టు కేసుల సాకుతో ప్రభుత్వం 250 ఎకరాలను ధరణిలోని ప్రొహిబిటెడ్ ​లిస్టులో పెట్టింది. అప్పట్లో తమకు భూములమ్మిన యజమాని మనుమడు డి. లీలా యుగందర్ బాబు, కొందరు రాజకీయనాయకులతో కలిసి తమ భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకు రెవెన్యూ ఆఫీసర్లు  వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ మేడ్చల్​కలెక్టరేట్​ముందు 200 మంది రైతులు ఆందోళన చేశారు. నిరసనకు బయలుదేరిన మరో 150 మంది రైతులను పోలీసులు బొమ్మరాసిపేటలోనే అరెస్ట్​చేసి శామిర్​పేట పోలీస్ స్టేషన్​కు తరలించారు. మేడ్చల్ జిల్లా  కలెక్టర్ హరీశ్ స్పందిస్తూ, ఏదైనా ఒక సర్వే నెంబర్ పైన ఫిర్యాదు వచ్చినప్పుడు, సమీప భూముల సర్వే నెంబర్లను కూడా నిషేధిత జాబితాలో పెట్టే అవకాశం ఉందన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.