సరుకు లోడింగ్‌లో కొత్త రికార్డులు

సరుకు లోడింగ్‌లో కొత్త రికార్డులు

గతేడాది కంటే 58% ఎక్కువ రవాణా

హైదరాబాద్‌ రైల్వే డివిజన్‌ ఘనత

హైదరాబాద్‌, వెలుగు: సౌత్​ సెంట్రల్​ రైల్వే పరిధిలోని హైదరాబాద్‌ డివిజన్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా పెద్ద ఎత్తున పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి 58 శాతం ఎక్కువ సరుకును పంపించారు. ఈ నెల 7వ తేదీ వరకు డివిజన్‌లో 10.6 మిలియన్‌ టన్నుల సరుకును రవాణా చేశారు. గతేడాది ఇదే టైంలో నమోదైన దానికంటే ఇది 58శాతం ఎక్కువ. నిరుడు  నమోదైన మొత్తం సరుకు లోడింగ్‌ 1.085 మిలియన్‌ టన్నుల మార్కును ఇప్పటికే అధిగమించింది. పోయినేడాది రవాణా రైళ్ల వేగం గంటకు 27 కిలోమీటర్ల కాగా, ఈ ఏడాది వేగం గంటకు 50 కిలోమీటర్లకు పెరిగింది. ఆఫీసర్లను జీఎం గజానన్‌ మాల్యా అభినందించారు.

సాధించిన విజయాలు ఇవి..

ఈ ఏడాది కొత్తగా వెల్దుర్తి స్టేషన్‌ నుంచి ఐరన్‌ ఓర్‌, క్వార్జ్​ చిప్స్‌, నిజామాబాద్‌ స్టేషన్‌ నుంచి మక్కలు, కౌకుంట్ల నుంచి బాయిల్డ్‌ రైస్‌ లోడ్‌ చేశారు.

తొలిసారిగా  నిజామాబాద్‌ స్టేషన్‌ నుంచి బంగ్లాదేశ్‌ సరిహద్దులకు పసుపును రవాణా చేశారు.

ఈ ఏడాది 0.847 మిలియన్‌ టన్నుల ధాన్యాలను ట్రాన్స్‌పోర్ట్‌ చేశారు. గతేడాది కంటే ఇది రెట్టింపు.

సరుకు రవాణా కస్టమర్ల కోసం 40 ఫుల్‌ వ్యాగన్లకు బదులుగా 20 వ్యాగన్లతో కూడిన మినీ రేక్‌ ఫెసిలిటీ కల్పించారు. దీంతో మొక్క జొన్న పంట రవాణా పెరిగింది.