
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్లలో మిడ్డెమీల్స్ స్కీమును మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు మొదలు పెట్టారు. స్టూడెంట్ల డేటాను ఎంటర్ చేసి, ఇతర వివరాలను ఇవ్వకుండా సరుకులు గోల్మాల్ చేస్తున్న వారికి చెక్ పెట్టేలా కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఇకపై మిడ్డెమీల్స్ యాప్‌లో స్టూడెంట్స్ డేటాతో పాటు వారికి రోజు వారీగా అందించే గుడ్డు, రాగిజావ, అరటిపండు వివరాలు కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 25 వేల బడుల్లో పీఎం పోషణ్ (మిడ్డెమిల్స్) స్కీము ద్వారా17 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. అయితే, ప్రస్తుతం రోజువారీగా విద్యార్థుల వివరాలను మిడ్డెమీల్స్ యాప్‌లో టీచర్లు అప్‌డేట్ చేస్తున్నారు. యూడైస్‌లో ఆ స్కూల్లోని విద్యార్థుల సంఖ్య అప్పటికే యాప్ లో ఉండటంతో, ఎంత మంది తిన్నారు, ఎంతమంది తినలేరు అనే వివరాలను ఇస్తున్నారు. అయితే, గుడ్లు, పండ్లు, రాగిజావ వివరాలను మాత్రం ఇవ్వడం లేదు.
ఈ క్రమంలో కొందరు హెడ్మాస్టర్లు తప్పుడు లెక్కలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వీటికి చెక్ పెట్టేందుకు విద్యాశాఖ అధికారులు యాప్‌ను అప్‌డేట్ చేశారు. ఇక నుంచి స్టూడెంట్ల డేటాతో పాటు ప్రతిరోజూ విద్యార్థులకు అందించే గుడ్లు, రాగిజావ, అరటిపండ్లు ఎంతమందికి అందించారనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. స్కీమును పక్కాగా అమలు చేసేందుకే ఈ డేటాను సేకరిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. మిడ్డెమీల్స్ యాప్‌ను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని
సూచిస్తున్నారు.