రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలకు మరో 2 నెలల్లో కొత్త టీచర్లు, లెక్చరర్లు

రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలకు మరో 2 నెలల్లో కొత్త టీచర్లు, లెక్చరర్లు

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కాలేజీల్లోకి త్వరలోనే కొత్త సార్లు రానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ ఎగ్జామ్స్ పూర్తికాగా, ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరిదశలో ఉంది. రెండు నెలల్లోనే వీరి నియామకాలు పూర్తి చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. 

దీంతో సర్కారు కాలేజీలు, స్కూళ్లు కొత్త సార్లతో కళకళలాడనున్నాయి.  ఏండ్ల తరబడి భర్తీకి నోచుకోకుండా ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి గతంలో స్కూల్ ఎడ్యుకేషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేశాయి. అయితే, 5,089 టీచర్ పోస్టులకు గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను కొత్త ప్రభుత్వం రద్దు చేసి 11,062 టీచర్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. 

ఇటీవలే ఆన్ లైన్​లో పరీక్షలు పూర్తికాగా, మంగళవారం ప్రిలిమినరీ కీ కూడా రిలీజ్ చేసింది. ఈ నెలాఖరులోగా రిజల్ట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే కొత్త టీచర్లు రానుండటంతో హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది. మరోపక్క సింగిల్ టీచర్ తో నడిచే స్కూళ్ల సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశముంది. 

వెరిఫికేషన్ దశలో జేఎల్ పోస్టులు..   

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,392 లెక్చరర్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష ఫలితాలనూ ఇటీవలే రిలీజ్ చేసింది. ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నడుస్తోంది. త్వరలోనే ఈ రిక్రూట్మెంట్ పూర్తికానున్నది. దీంతో మల్టీ జోన్1 పరిధిలో 724 మంది, మల్టీజోన్ 2లో 668 మంది కొత్త లెక్చరర్లు రానున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీల్లో లెక్చరర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. 

వాటిలోని పోస్టులనూ కొత్త వారితో భర్తీ చేసే అవకాశముంది. పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా పరీక్షలు పూర్తయ్యాయి. వారికీ త్వరలోనే నియామక పత్రాలూ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  

డీఎల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ 

సర్కారు డిగ్రీ కాలేజీల్లో 544 పోస్టుల భర్తీకి డిసెంబర్ 2022లోనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 491 డిగ్రీ లెక్చరర్లు, 29  పీడీ, 24 లైబ్రరియన్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించింది. అయితే, డిగ్రీ కాలేజీల్లో పని చేసే లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్లుగా పిలుస్తుండగా యూజీసీ మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పిలుస్తోంది. ఈ విషయంలో కొన్ని టెక్నికల్ సమస్యలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. 

చివరికి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే పిలవాలని నిర్ణయించిన విద్యాశాఖ.. రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్కారు నుంచి ఆమోదం రాగానే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ముందుకు సాగుతుందని అధికారులు చెప్తున్నారు.