కేసీఆర్ వారియర్స్.. సీఎంపై మాట పడనివ్వని మంత్రులు వీళ్లే..

కేసీఆర్ వారియర్స్.. సీఎంపై మాట పడనివ్వని మంత్రులు వీళ్లే..
  • ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు
  • అంటనట్లు ఉంటున్న కేటీఆర్​.. మౌనంగా హరీశ్​రావు
  • అప్పుడప్పుడూ మండలి విప్​ కర్నె ప్రభాకర్​ కౌంటర్​

హైదరాబాద్, వెలుగుటీఆర్​ఎస్​లో కేసీఆర్ వారియర్స్​గా   కొత్త టీం తయారైంది. ఈ టీంలో బీసీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్​ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కేసీఆర్ పై ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఈ టీం పోరాటం చేస్తోంది. కేసీఆర్​పై ఈగ వాలినా ఊరుకోం అన్నట్టుగా వ్యవహరిస్తోంది. అపోజిషన్ పార్టీలు చేసే విమర్శలను  ఖండించేందుకు ఈ నాయకులు ఎక్కడున్నా  వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు.  ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తున్నారు. కొన్నిసార్లు వాళ్లు చేసే ప్రతివిమర్శలు వ్యక్తిగతంగా అబాసుపాలయ్యేలా ఉన్నా  పట్టించుకోవడం లేదు. కరోనా నియంత్రణ, సెక్రటేరియట్ కూల్చివేత, ఫాం హౌస్​లో సీఎం ఉండటం, కాళేశ్వరం కాలువలకు గండ్లు పడటం, ఉస్మానియా హాస్పిటల్ లో వర్షం నీరు చేరడం వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఎప్పటికప్పుడు ఈ టీం ఘాటుగా స్పందిస్తోంది.

అపోజిషన్ పార్టీల విమర్శలకు  వెంటనే కౌంటర్ ఇవ్వడంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ముందు వరసలో ఉంటున్నారు. అది జాతీయ అంశమైన, రాష్ట్రానికి చెందిన అంశమైనా, హైదరాబాద్ కు చెందిన అంశమైనా వెంటనే మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫాం హౌస్​కే పరిమితమయ్యారని కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసిన విమర్శలను ఖండిస్తూ.. ‘‘గతంలో సీఎం ఫాం హౌజ్ కు పోలేదా..? గతంలో  సీఎంగారు సెక్రటేరియట్ కు వచ్చే పాలించారా..? పొద్దునలేస్తే ఆ కుటుంబంపై విమర్శలు చేయడమే పనా..?’’ అంటూ మండిపడ్డారు. ఉస్మానియా హాస్పిటల్ లోకి నీళ్లు రావడంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు స్పందిస్తూ.. ‘‘నాడు కొత్త హాస్పిటల్ నిర్మిస్తామంటే వద్దన్నరు.. ఇప్పుడు అడ్డుకోమని చెప్పండి ఏడాదిలో కొత్త బిల్డింగ్ కడుతం’’ అని అన్నారు. హైదరాబాద్ లో మళ్లీ లాక్ డౌన్ పెట్టాలనే ప్రతిపాదన ఉందని సీఎం చెప్పడంతో సిటీ సగం ఖాళైంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని గ్రహించిన ప్రభుత్వం.. లాక్ డౌన్ అవసరం లేదని మంత్రి తలసానితో మాట్లాడించినట్టు టీఆర్​ఎస్​ నేతలు అంటున్నారు.

అన్ని అంశాలపై మాట్లాడుతున్న శ్రీనివాస్ గౌడ్

ప్రతిపక్షాలు ఏ చిన్న విమర్శ చేసినా మంత్రి శ్రీనివాస్ గౌడ్  వెంటనే స్పందిస్తున్నారు. ఇక ఎవరైనా కేసీఆర్, కేటీఆర్ ను  విమర్శిస్తే ఆయన సహించడం లేదు. దేనికైనా సిద్ధం అనే తీరుగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య మహబూబ్ నగర్ లో కేసీఆర్ పేరు మీద ఓ పార్కు, కేటీఆర్ పేరు మీద ఓ కాలనీ ఏర్పాటు చేయించి ఆ రెండిటినీ కేటీఆర్ తో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ప్రారంభింపజేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు శ్రీనివాస్ గౌడ్  స్పందిస్తూ.. ‘‘ఔను.. కేసీఆర్, కేటీఆర్ పేరు మీద పార్కు, కాలనీ ఏర్పాటు చేస్తే తప్పేంటి? వాళ్ల  పేర్ల మీద ప్రతి జిల్లాల్లో కాలనీలను గ్యారెంటీగా ఏర్పాటు చేస్తం. వారు తెలంగాణ బిడ్డలు’’ అని చెప్పారు. కాళేశ్వరం కాలువలకు గండ్లు పడటంపై వచ్చిన విమర్శలకు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘గండ్లు కాలువలకు పడకపోతే, మనుషులకు పడుతాయా? గండ్లు పడటం ఏమైనా వింతనా?’’ అని ప్రశ్నించారు. సెక్రటేరియట్ నిర్మిస్తే కేసీఆర్ కు పేరొస్తుందన్న అక్కసుతో  కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

ఈటల, గంగుల కూడా..!

కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్  కూడా ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు  కౌంటర్లు ఇస్తున్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని, వైద్య సేవలు అందక పేషెంట్లు చనిపోతున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై ఈటల మాట్లాడుతూ.. ‘‘ఒకరిద్దరు చనిపోతే ఇంత బద్నాం చేస్తరా? కరోనా పేషెంట్లు తమ కుటుంబసభ్యులతో మాట్లాడుకోవడానికే హాస్పిటళ్లలో ఇంటర్నెట్​, ఫోన్​ పెట్టినం. ఆక్సిజన్​ పెట్టలేదని, డాక్టర్లు చూడటం లేదని వీడియోలో తీసి పెట్టడానికి కాదు’’ అని వ్యాఖ్యానించారు. గాంధీ హాస్పిటల్ లో చేరిన ఓ జర్నలిస్ట్ సరైన ట్రీట్ మెంట్ అందడం లేదని వీడియో కాల్ లో తన ఫ్రెండ్స్ తో మాట్లాడారు. ఇది సోషల్ మీడియాలో వైరలైంది. దీనికి ఈటల స్పందిస్తూ.. ‘‘కొందరు సైకోలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండ్రు. అర్ధరాత్రి భోజనం లేదని, అదిలేదని, ఇది ఇవ్వలేదని అంటున్నరు. కొందరు సైకోలు ఉంటరు’’ అని కామెంట్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తున్నారు. ‘‘కేసీఆర్ పుట్టిన గడ్డ మీద నేను పుట్టడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను’’ అని ఓ సందర్భంలో ఆయన
వ్యాఖ్యానించారు.

అప్పుడప్పుడు కర్నె ప్రభాకర్ కౌంటర్​

మండలి విఫ్ కర్నె ప్రభాకర్ ప్రతిపక్షాల విమర్శలకు అప్పుడప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. కాళేశ్వరం,సెక్రటేరియట్, ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణాలను కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

అప్పట్లో ముందుకొచ్చిన్నోళ్లు ఇప్పుడు మౌనం

ముందస్తు అనుమతి లేకుండానే ప్రగతిభవన్ లోకి వెళ్లే చొరవ ఉన్న లీడర్లు కొంత కాలంగా మౌనంగా ఉంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షాల విమర్శలకు వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీశ్​రావు, కేటీఆర్​తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉండేవారు. మీడియా ముందుకు వచ్చి అపోజిషన్ పార్టీల నేతలపై ప్రతి విమర్శలు చేసేవారు. కానీ కొంత కాలంగా ఈ  లీడర్లు ప్రతిపక్షాల విమర్శలను ఖండించేందుకు శ్రద్ధ చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. ఏదైనా ప్రభుత్వ ప్రోగ్రాంలో పాల్గొన్న సందర్భంగా మాత్రమే కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి హరీశ్ రావు ఉమ్మడి మెదక్  జిల్లా పర్యటన, ఆర్థికశాఖ సమీక్షల్లో బిజీగా ఉంటున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలు, చాన్స్ దొరికితే కుటుంబంతోనే ఉండేందుకు శ్రద్ధ చూపుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రి కేటీఆర్ ఇటీవల మహబూబ్ నగర్ లో ప్రభుత్వ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ… ‘‘రాష్ట్రంలో మరణాల రేటు 2 శాతమే ఉంది. కరోనా కట్టడిలో కేసీఆర్​ ఫెయిలైతే మరి ఎవరు పాసైనట్టు. కరోనా కేసుల్లో దేశం మూడో స్థానంలో ఉంది. అంటే ప్రధాని ఫెయిలైనట్టా?’’ అని ప్రశ్నించారు. ప్రగతిభవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కొంత కాలంగా ఏం మాట్లాడం లేదు. ప్రతిపక్షాల విమర్శలపై మిగతా మంత్రులు మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మౌనంగా ఉంటున్నారు.