- నేడు న్యూజిలాండ్, సౌతాఫ్రికా విమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
దుబాయ్: రెండుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకున్న న్యూజిలాండ్, రెండోసారి ఫైనల్‌కు చేరిన సౌతాఫ్రికా.. విమెన్స్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ ఫైట్‌కు రెడీ అయ్యాయి. ఆదివారం జరిగే ఫైనల్లో గెలిచి కొత్త చాంపియన్‌గా నిలవాలని ఇరుజట్లూ టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అప్పుడెప్పుడో 2000 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత కివీస్ ఇప్పటి వరకు మరో మెగా కప్ సాధించలేదు. అలాగే కెప్టెన్ సోఫీ డివైన్ కెరీర్ కూడా చివరి అంకానికి చేరడంతో ఎలాగైనా ఈసారి కప్‌తో ఈ రెండు లక్ష్యాలను నెరవేర్చుకోవాలని కివీస్ ప్లేయర్లు భావిస్తున్నారు.
డివైన్, బేట్స్, లీ తహుహు, అమెలియా కెర్ సత్తా చాటితో సౌతాఫ్రికాను కట్టడి చేయడం ఈజీయే. కెరీర్‌లో 7 వేల రన్స్ చేసిన డివైన్‌పైనే భారీ అంచనాలున్నాయి. పేసర్ తహుహు వన్డేల్లో 112, టీ20ల్లో 93 వికెట్లు తీసింది. దీంతో ఆమె అనుభవం ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. మరోవైపు సౌతాఫ్రికాను కూడా తక్కువగా అంచనా వేయలేం. సెమీస్‌లో ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించడం వాళ్ల ఆత్మవిసాన్ని గణనీయంగా పెంచింది. గతేడాది సొంతగడ్డపై మిస్సయిన వరల్డ్ కప్‌ను ఈసారి చేజిక్కించుకోవాలని సఫారీలు ప్లాన్స్ వేస్తున్నారు. కెప్టెన్ లారా వోల్‌వర్త్, అనెకా బాష్, తన్జిమ్ బ్రిట్స్ బ్యాటింగ్‌లో మెరిస్తే భారీ స్కోరు ఖాయం. కాప్, ఖాకా, మలాబా, ట్రయాన్‌పై కూడా అంచనాలున్నాయి. ఓవరాల్‌గా బలం, బలగం సమానంగా ఉన్న ఇరుజట్లలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.