న్యూజిలాండ్‌‌‌‌ రికార్డు విక్టరీ.. రెండో టెస్టులో ఇన్నింగ్స్‌‌ 359 రన్స్‌‌ తేడాతో జింబాబ్వేపై గెలుపు

న్యూజిలాండ్‌‌‌‌ రికార్డు విక్టరీ.. రెండో టెస్టులో ఇన్నింగ్స్‌‌ 359 రన్స్‌‌ తేడాతో జింబాబ్వేపై గెలుపు

బులవాయో: బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌లో దుమ్మురేపిన న్యూజిలాండ్‌‌.. తమ టెస్ట్‌‌ క్రికెట్‌‌ చరిత్రలో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అరంగేట్రం బౌలర్‌‌ జకారీ ఫౌల్క్స్‌‌ (5/37) సూపర్‌‌ షో చూపెట్టడంతో.. జింబాబ్వేతో మూడు రోజు, శనివారం ముగిసిన రెండో టెస్టులో కివీస్‌‌ ఇన్నింగ్స్‌‌ 359 రన్స్‌‌ తేడాతో గెలిచింది. 

ఫలితంగా 2012లో నేపియర్‌‌లో జింబాబ్వేపైనే నెలకొల్పిన ఇన్నింగ్స్‌‌ 301 పరుగుల రికార్డు విజయాన్ని అధిగమించింది. ఇక తొలి టెస్ట్‌‌లోనూ నెగ్గిన కివీస్‌‌ రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 2–0తో క్లీన్‌‌స్వీప్‌‌ చేసింది. ఓవర్‌‌నైట్‌‌ స్కోరు 601/3 స్కోరు వద్ద కివీస్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ను డిక్లేర్‌‌ చేసింది. రచిన్‌‌ రవీంద్ర (165 నాటౌట్‌‌), హెన్రీ నికోల్స్‌‌ (150 నాటౌట్‌‌), డేవన్‌‌ కాన్వే (153) సెంచరీలతో దుమ్ములేపారు. తర్వాత 476 రన్స్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌ లోటుతో శనివారం మూడో రోజు బ్యాటింగ్‌‌కు దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌‌లో 28.1 ఓవర్లలో 117 రన్స్‌‌కే ఆలౌటైంది. 

ఈ సిరీస్‌‌లో ఇదే అత్యల్ప స్కోరు. నిక్‌‌ వెల్చ్‌‌ (47 నాటౌట్‌‌) టాప్‌‌ స్కోరర్‌‌. క్రెయిగ్‌‌ ఎర్విన్‌‌ (17)తో సహా మిగతా 
వారు విఫలమయ్యారు. డేవన్‌‌ కాన్వేకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, 16 వికెట్లు తీసిన మ్యాట్‌‌ హెన్రీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి. ఈ ఏడాది టెస్టుల్లో జింబాబ్వేకు ఇది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం.