IND vs NZ 4th T20I: దూబే దంచికొట్టినా టీమిండియాకు తప్పని ఓటమి.. సిరీస్‌లో బోణీ కొట్టిన న్యూజిలాండ్

IND vs NZ 4th T20I: దూబే దంచికొట్టినా టీమిండియాకు తప్పని ఓటమి.. సిరీస్‌లో బోణీ కొట్టిన న్యూజిలాండ్

న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఓడిపోయింది. బుధవారం (జనవరి 28) విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో మన జట్టుకు పరాజయం తప్పలేదు. 216 పరుగుల భారీ ఛేజింగ్ లో టీమిండియా విజయం కోసం దూబే (23 బంతుల్లో 65: 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అసాధారణంగా పోరాడినా మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. మరోవైపు న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి సిరీస్ లో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది.  

82 పరుగులకే 5 వికెట్లు:
 
216 పరుగుల భారీ టార్గెట్ లో టీమిండియా తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. హెన్రీ బౌలింగ్ లో తొలి బంతికే షాట్ ఆడిన అభిషేక్ (0) థర్డ్ మ్యాన్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఫామ్ లోకి వచ్చిన సూర్య ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. కేవలం 8 పరుగులు చేసి డఫీకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియా 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రింకూ సింగ్, సంజు శాంసన్ జాగ్రతగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఉన్నంత సేపు మంచి టచ్ లో కనిపించిన శాంసన్ (24) ను సాంట్నర్ బౌల్డ్ చేసి టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చాడు.

దూబే ధనాధన్:
 
ఆడుకుంటాడనుకున్న పాండ్య (2) తో పాటు అప్పటివరకు బాగ్ ఆడిన రింకు సింగ్ (39) కూడా ఔట్ కావడంతో ఇండియా 82 పరుగుల వద్ద 5 వికెట్లను కోల్పోయి ఓటమి వైపు సాగింది. ఈ దశలో శివమ్ దూబే శివాలెత్తాడు. ఒక్కడే కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. సోది వేసిన ఇన్నింగ్స్ 12 ఓవర్లో 29 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న దూబే జట్టుకు విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే దూబే అనుకోని విధంగా రనౌట్ కావడంతో ఇండియా పరాజయం ఖాయమైంది. టైలాండర్స్ కూడా త్వరగా ఔట్ కావడంతో ఇండియా 165 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్ మూడు.. సోది, డఫీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.     

►ALSO READ | Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు సిన్నర్.. జొకోవిచ్‌తో బ్లాక్ బస్టర్ ఫైట్‌కు రంగం సిద్ధం

చెలరేగిన కివీస్ ఓపెనర్లు: 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు కాన్వే, సీఫెర్ట్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే వీరిద్దరూ భారత బౌలలపై ఎదురుదాడికి దిగారు. తొలి ఓవర్లోనే సీఫెర్ట్ మూడు ఫోర్లు కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. సీఫెర్ట్ తో పాటు మరో ఎండ్ లో కాన్వే కూడా బ్యాట్ ఝులిపించడంతో పవర్ ప్లే లో న్యూజిలాండ్ వికెట్ కోల్పోకుండా 71 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా వీరిద్దరి జోరు తగ్గలేదు. వీరిద్దరి మెరుపులకు కివీస్ 8.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. తొలి వికెట్ కు 100 పరుగులు జోడించిన తర్వాత కాన్వేను ఔట్ చేసి కుల్దీప్ యాదవ్ టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. 

ఆ తర్వాత ఓవర్లోనే రచీన్ రవీంద్ర వికెట్ ను బుమ్రా పడగొట్టి రెండో వికెట్ అందించాడు. మరో ఎండ్ లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ చేసుకొని జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. మిడిల్ ఓవర్స్ లో ఇండియా బౌలర్లు పుంజుకోవడంతో కివీస్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చింది. డారిల్ మిచెల్ తప్ప వచ్చినవారు బ్యాటింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. వికెట్లను కోల్పోయినా కివీస్ మాత్రం రన్ రేట్ తగ్గకుండా పరుగులు చేస్తూ వచ్చింది. చివరి వరకు క్రీజ్ లో ఉన్న మిచెల్ 18 బంతుల్లోనే 39 పరుగులు చేసి జట్టును 200 పరుగుల మార్క్ దాటించాడు.  టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. బుమ్రా, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.