
కోరుట్ల, వెలుగు: నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు గంగోత్రి (22), అదే గ్రామానికి చెందిన అల్లెపు సంతోష్ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో గత నెల 26న పెండ్లి చేసుకున్నారు. గురువారం దసరా రోజు భర్తతో కలిసి గంగోత్రి పుట్టింటికి వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి అన్నం తింటుండగా చిన్న గొడవ జరిగింది.
అదే రోజు తిరిగి అత్తారింటికి వెళ్లింది. శుక్రవారం ఆమె ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరేసుకుని చనిపోయింది. భర్త వచ్చి చూసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పండగ రోజు పుట్టింట్లో జరిగిన గొడవ విషయమై మనస్తాపం చెంది గంగోత్రి ఆత్మహత్య చేసుకుందా..? లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు తల్లి శారద పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెట్పల్లి సీఐ అనిల్, ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ తెలిపారు.