
మోడీ ఫొటోకు ముస్లిం మహిళల పాలాభిషేకం
కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో బీజేపీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం తెలపడంతో ప్రధాని మోడీ ఫొటోకు ముస్లిం మహిళలు పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదన్నారు.
కుమ్రంభీం జిల్లాలో చైన్ స్నాచర్
కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో చోరీ జరిగింది. స్థానిక కూరగాయలు మార్కెట్ దగ్గర్లో ఓ వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు దొంగిలించారు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు. మార్కెట్ కు బయలుదేరిన వృద్ధురాలిని టార్గెట్ చేసుకొని రెండున్నర తులాల గోల్డ్ చైన్ దొంగిలించి పరారయ్యారు.
15 మంది గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల అస్వస్థత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏడో తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు నిన్న రాత్రి నుంచి వాంతులు విరోచనాలతో బాధపడుతుండగా స్థానిక బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
ప్రైవేట్ వర్శిటీల ఏర్పాటును నిరసిస్తూ విద్యార్ధుల ర్యాలీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటును నిరసిస్తూ ఖమ్మం జిల్లా వైరాలో AISF ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ జరిగింది. ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా ప్రైవేట్ వర్సిటీల కోసం జీవో విడుదల చేయడాన్ని తప్పుపట్టారు. ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థుల హరితహారం
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని ప్రాథమిక పాఠశాలల్లో పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ రమాకాంత్, ఎస్సై నరేష్ పాల్గొని మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.
పేదలకు అండగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా వేల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయన్నారు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. రఘునాథపాలెం తహశీల్దార్ ఆఫీసులో ఈ పథకాల కింద మంజూరైన దాదాపు 14 లక్షల విలువైన 14 చెక్కులను లబ్డిదారులకు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ఏ సంక్షేమ పథకం చేపట్టినా పేదలకు కొండంత అండగా ఉంటుందన్నారు.
విద్యుత్ శాఖ ఆఫీస్ ముందు రైతులు ధర్నా
ఖమ్మం జిల్లా బోనకల్ విద్యుత్ శాఖ ఆఫీస్ ముందు రైతులు ధర్నా చేశారు. ఏఈ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. లో వోల్టేజ్ తో వ్యవసాయ మోటార్లు, ఇళ్లల్లోని గృహోపకరణాలు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కరీంనగర్ లో జాతీయ ఆటో కార్మికుల దినోత్సవం
జాతీయ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, మాజీ కార్పోరేటర్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. స్వయం ఉపాధి మార్గంగా ఆటోలు నడుపుతూ జీవిస్తున్నా వేల మంది ఆటో డ్రైవర్లు ప్రయాణికులకు ఎంతో సేవ చేస్తున్నారని నారదాసు లక్ష్మణ్ రావు కొనియాడారు.
కల్వకుర్తి సబ్ జైలర్ సుధాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి సబ్ జైలర్ సుధాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. సుధాకర్ రెడ్డి ఎస్సైని అని చెప్పుకుంటూ ఓ ఇసుక వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన ఆడియో టేప్ వైరల్ గా మారింది. దీంతో విచారణ చేపట్టిన పోలీస్ శాఖ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేసింది.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని రహ్మత్ నగర్, పస్తాపూర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని అక్కడికక్కడే పరిష్కరించి రెండు నెలల్లో లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పనుల్లో నాణ్యతా పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదని కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
జింకను తిన్న కొండాపురం గ్రామస్తులు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం కొండాపురంలో జింకను తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండాపురం చుట్టూ అటవీ ప్రాంతంగా చెట్లు ఉండటంతో జింకను వలపన్ని పట్టారని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. 15 రోజుల క్రితమే జింకను తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయనీ…, వాటి ఎముకలను ల్యాబ్ కి పంపుతామని చెప్పారు ఫారెస్ట్ అధికారులు. ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం.
వరంగల్: ఈనెల 3 నుంచి నగర బాట
వరంగల్ నగరంలోని ప్రజల సమస్యలు పరిష్కరించటం కోసం ఈనెల 3 నుంచి నగర బాట చేపడతామన్నారు మేయర్ గుండా ప్రకాశ్ రావు. నగరంలోని 58 డివిజన్లలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తామని చెప్పారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకుని అ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల రిలే నిరహర దీక్షలు
కనీస వేతనాలు అమలు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఏకశిల పార్క్ లో గ్రామాబివృద్ది శాఖలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు రిలే నిరహర దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం ఉద్యోగులకు కల్పించిన హెల్త్ కార్డులు, తమకూ ఇవ్వాలని కోరారు. నో వర్క్ నో పే విదానం తొలగించి.. ఆర్జిత సెలవుల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఆందోళన
నల్గొండ జిల్లా మర్రిగూడా మండలంలో చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఆందోళన చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 5 లక్షల 15 రూపాయల నష్టపరిహారం సరిపోదని 12 లక్షలు ఇవ్వాలని అధికారులను నిలదీశారు.